హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): గిరిజన విద్యార్థుల విదేశీ విద్యకోసం అమలుచేస్తున్న అంబేద్కర్ ఓవర్సీస్ పథకానికి పూర్తిస్థాయి ఆదరణ లభిస్తున్నది. తొలుత 50 మంది లక్ష్యంగా ప్రారంభించిన పథకాన్ని ప్రస్తుతం ఏటా 100 మంది వినియోగించుకుంటున్నారు.
కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం 2014-15లో అంబేద్కర్ ఓవర్సీస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఒక్కో విద్యార్థి విదేశీ విద్యకోసం రూ.20 లక్షల వరకు మంజూరు చేశారు. 2022-23 సంవత్సరంలో ఈ పథకాన్ని ఏటా 100 మందికి అమలు చేయాలని నిర్ణయించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) నుంచి ఏటా 250 మంది గిరిజన విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులు కోరుతున్నారు.