శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 11:47:25

తెలంగాణ చ‌రిత్ర‌లో అతిపెద్ద విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు

తెలంగాణ చ‌రిత్ర‌లో అతిపెద్ద విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు

హైద‌రాబాద్ : రాష్ర్టంలో పెట్టుబ‌డుల‌పై ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉద‌యం 11:30 గంట‌ల స‌మ‌యంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా కేటీఆర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. తెలంగాణ చ‌రిత్ర‌లో అతిపెద్ద విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు ప్ర‌క‌టించినందుకు సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్(‌AWS) రాష్ర్టంలో రూ. 20,761 కోట్ల పెట్టుబ‌‌డులు పెట్ట‌నుంది. తెలంగాణ‌లో ప‌లు ప్రాంతాల్లో డేటా కేంద్రాల‌ను అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్ ఏర్పాటు చేయ‌నుంది. హైద‌రాబాద్‌లో 2022లో అమెజాన్ వెబ్ స‌ర్వీసెస్ సంస్థ త‌న కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించే అవ‌కాశం ఉంది. 

తన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా ఏషియా పసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు అమెజాన్ సంస్థ నిర్ణ‌యం తీసుకుంది. హైదరాబాదులో మూడు అవైలబిలిటీ జోన్లను ఏర్పాటు చేయనుంది. ప్రతి అవైలబిలిటీ జోన్లో అనేక డాటా సెంటర్ల ఏర్పాటు చేయ‌నుంది. 

స్వాగ‌తించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు త‌ర్వాత విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డి ఇదే అని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. అమెజాన్ భారీ పెట్టుబ‌డిని స్వాగ‌తిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇంత భారీ పెట్టుబడి రావడం అంటే తెలంగాణ ప్రభుత్వ విధానాలకు ఉన్న ప్రాధాన్యత అర్థం అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ పారదర్శక, వేగవంతమైన పరిపాలన విధానాల వల్లనే తెలంగాణకు భారీ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ను తన దావోస్ పర్యటనలో కలిసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ పెట్టుబడి తర్వాత తెలంగాణ డేటా సెంటర్ల పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతుందని కేటీఆర్ విశ్వాసం వ్య‌క్తం చేశారు. ఈ పెట్టుబడి ద్వారా ఇప్పటికే అతిపెద్ద కార్యాలయాన్ని కలిగి ఉన్న అమెజాన్ సంస్థతో తెలంగాణ బంధం మరింత బలోపేతం అవుతుంద‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.