రామాయంపేట, మే 31: కొంచెం తీపి మరికొంచెం వగరుగా ఉండే అల్లనేరేడు పండ్ల (Jamun) సీజన్ వచ్చేసింది. మార్కెట్లో నిగనిగలాడుతూ నోరూరిస్తున్నాయి. వీటిని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తికాదు. అల్లనేరేడు పండ్లు ఆరోగ్యానికి మేలు చేకూరుతాయని వైద్యులు కూడా చెబుతున్నారు. ఇందులో విశిష్ట గుణాలుం టాయని పేర్కొంటున్నారు. మధుమేహం, కిడ్నీ రోగులకు ఇవి దివ్యఔషదంగా పనిచేస్తాయి. అల్లనేరేడు పండ్ల చెట్లు గతంలో ఎటుచూసినా ఇళ్ల ఆవరణలో కనపడేవి. కానీ కాలక్రమేనా అవి ఇళ్లలో కాకుండా ఎక్కువ శాతం అడవి ప్రాంతంలోనే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో హైబ్రిడ్ రకం పండ్లు జోరుగా రావడంతో డిమాండ్ బాగా పెరిగింది. సాధారణ రకం నేరేడుపండ్లు మార్కెట్లో కిలో రూ.100 పలుకగా, హైబ్రిడ్ రకం పండ్లయితే రూ.150 వరకు ఉంటుంది. ప్రతి ఏడాది మే, జూన్ మాసాల్లోనే వచ్చే ఈ నేరేడు పండ్ల కోసం గ్రామాలలోని కొంత మంది రోజు కూలీలు ఉదయమే అడవిబాట పట్టి మధ్యాహ్నం వరకు గంపలలో తీసుకొచ్చి మార్కెట్లో విక్రయిస్తుంటారు.
ప్రస్తుతం పండ్ల షాపులలో హైబ్రిడ్ పండ్లు అమ్మకాలు జరుపడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అల్లనేరేడు పండ్లు విక్రయించే వారు రామాయంపేట పట్టణంతో పాటు మండలంలోని ఏ ప్రాంతం లో చూసినా వీరి విక్రయాలు కనిపిస్తున్నాయి.దీంతో ప్రజలు ఈ పండ్లపై చాలా ఆసక్తి కనబరుస్తున్నారు.
అల్లనేరేడు పండ్లు సర్వరోగ నివారిని ఈ పండ్లలో ఏ.సీ.విటమిన్లు పుష్కలంగా ఉంటాయని ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ హరిప్రియ చెప్పారు. ఈ పండ్లు మనలో ఉన్న మలినాలను, విషాన్ని అరికట్టడంతోపాటు రుచికూడా అధికంగా ఉంటుంది. దీంతో ఎక్కువ శాతం ప్రజలు మెగ్గు చూపుతారు. ముఖ్యంగా గర్భంతో ఉన్న మహిళలు ఈ పండ్లను తింటే వారికెంతో మేలు చేకూరుతుంది. మధుమేహ వ్యాది గ్రస్తులు, కిడ్నీ, షుగర్, నోటిపూత, నోటి క్యాన్సర్, మూత్రాశయ సమస్యలకు టానిక్‌లా పనిచేస్తాయి. నేరేడు గింజలను చూర్ణం చేసి తాగితే షుగర్ లెవల్‌ను తగ్గడంతోపాటు చిగుళ్లవ్యాదితో బాధపడే వారికి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
అల్లనేరేడు పండ్లు ఎండాకాలంలోనే లభిస్తాయని నిజాంపేట మండలం నస్కల్ గ్రానికి చెందిన సుగుణ అనే మహిళ అన్నారు. గతంలో అడవికి దగ్గరలోనే ఉంటుండే. ప్రస్తుతం అవి దొరకాలంటే అడవిలో కిలోమీటర్ల దూరం వెళ్లాలి. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి పది కిలోమీటర్ల మేర అడవికి పోతే ఎక్కడో ఓ చోట చెట్టు కనిపిస్తది. ఆ చెట్టు పైకెక్కి జాగ్రత్తగా పండ్లను తెంపాలి. ఏ మాత్రం అజాగ్రత్త వహిస్తే పండ్లన్నీ చెడిపోతాయి. నేరేడు పండ్లను గంపలలో తీసుకొచ్చి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో అమ్ముతాం. ప్రస్తుతం కిలో రూ.100 విక్రయాలు జరుపుతున్నామని తెలిపారు.
మధుమేహ నివారణలో..
రక్తంలో చక్కెర నిల్వల స్థాయిలను క్రమబద్దీకరించడంలో జామూన్లు చాలా గొప్పగా పనిచేస్తాయి. వీటి గింజల్లో జంబోలిన్, జాంబోసిస్ అనే సమ్మెళనాలు ఉండి వీటిని తినగానే రక్తంలోకి చక్కెర విడుదల రేటును నియంత్రిస్తాయి. జామూన్ విత్తనాలు కూడా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి.
ఫైబర్ కలిగి ఉండి..
అల్లనేరేడు కడుపు ఆరోగ్యాన్ని పెంచుతాయి. వీటి గింజలను తినడం వల్ల కడుపు సంబంధ సమస్యలను నివారించవచ్చు. వీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇవి పేగుల్లో పుండ్లు, మంట, పూతలను ఎదుర్కోవడానికి ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు.
రక్తపోటు నివారణలో..
నేరేడు పండ్లు రక్తపోటు నివారణలో గ్రేట్‌గా పనిచేస్తుంది. వీటి విత్తనంలో ఎల్లాజిక్ యాసిడ్ అనే యాంటీఆక్సిడెంట్ రక్తపోటు హెచ్చుతగ్గులను తనికీ చేయడంలో సహాయపడుతుంది. రక్తపోటుతో బాధపడేవారు వీటిని ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
రోగనిరోధక శక్తిలో..
అల్ల నేరేడు గింజల్లో ఫ్లేవనాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తాయి. అలాగే వీటిలోని ఫ్రీ రాడికల్స్‌ను దూరంగా ఉంచడంలో సహాయపడే ఫినాలిక్ సమ్మేళనాలు ఉంటాయి.
బరువు తగ్గడంలో..
శరీరం బరువు తగ్గడంలో నేరేడు పండ్లు సహకరిస్తాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండి ఆకలి భావన రాకుండా చూస్తాయి. ఫలితంగా శరీరం బరువు తగ్గించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుంది.