హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ-2003 టీచర్లకు పాత పింఛన్ అమలుచేయాలని, లేదంటే ఆమరణ దీక్షకు దిగుతానని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి సర్కార్‌ను హెచ్చరించారు. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను వారం లోగా ఉపసంహరించుకోవాలని, లేదంటే పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలకు సిద్ధమని ఆయన ప్రకటించారు.
ఆదివారం జనగాం జిల్లా కేంద్రంలో పీఆర్టీయూ టీఎస్ నిర్వహించిన ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్లు విడుదలై, ఆ తర్వాత నియమితులైన 2003 డీఎస్సీ టీచర్లకు పాత పింఛన్ వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఆదేశించిందని, 57/4, 57/5 మెమోలను సైతం జారీచేసిందని గుర్తుచేశారు.
ఆలస్యంగా నియమితులైన వారికి కేంద్ర ప్రభుత్వం పాత పింఛన్ వర్తింపజేస్తుందని తెలిపారు. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా పాత పింఛన్ అమలుచేయాలని స్పష్టమైన తీర్పునిచ్చిందని, అయినా పాత పింఛన్ అమలుకు నోచకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలతో ఉద్యోగ సంఘాల జేఏసీ జరిపిన చర్చల్లోనూ ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చి, సుప్రీం కోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేయడం గర్హనీయమన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పులగం దామోదర్‌రెడ్డి, ఎస్ భిక్షంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.