మీనాక్షీ శేషాద్రి గుర్తుందా? అందం, అభినయంతో అత్యధిక పారితోషికం అందుకున్న ఆ అందాల తారని మర్చిపోగలరా? 1982-90 మధ్య కాలంలో దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా మీనాక్షీ పేరు మోగిపోయేది. మిస్ ఇండియా కిరీటం గెలిచి, వెండితెరపై అడుగుపెట్టిందామె. అందానికి అభినయం తోడైతే మీనాక్షి. వెండితెరపై అగ్రతారగా వెలిగిపోయింది.
హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుని తెరమరుగైన అలనాటి సౌందర్యం మళ్లీ వెలుగులోకి వస్తున్నది! విపుల్ షా దర్శకత్వంలో ప్రైమ్ వీడియో కోసం నిర్మాణమవుతున్న ‘నానావతి వర్సెస్ నానావతి’ సిరీస్‌లో కోర్టు రూమ్‌లో మీనాక్షి ల్యాండ్ అవుతుందట. బాలీవుడ్లో జాకీష్రాఫ్-మీనాక్షికి హిట్‌పెయిర్‌గా పేరున్నది.
హిందీ సినిమా హీరో (1983)లో జాకీ ష్రాఫ్, మీనాక్షీ కలిసి నటించి, మంచి జోడీగా.. దశాబ్ద కాలం ఓ వెలుగు వెలిగారు. ఈ వెబ్‌సిరీస్‌లో జాకీ ష్రాఫ్ కూడా కనిపిస్తాడట. ఆ జోడీ మళ్లీ ‘నానావతి వర్సెస్ నానావతి’లో కలిసి నటిస్తుండటం విశేషం! ఎనభైల నాటి హిట్‌పెయిర్‌గా పేరున్న వీళ్లద్దరి జోడీ ఏ మేరకు అలరిస్తుందో చూడాలి!!