హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): కాలంతో పోటీపడి పరుగెడుతున్న నేటి ఆధునిక సమాజంలో ఎంతో మందికి నాణ్యమైన ఆహారాన్ని తయారు చేసుకునే తీరిక కూడా ఉండటం లేదు. ఉరుకులు పరుగులతో కూడిన జీవితంలో సులభంగా ఆహారాన్ని తయారు చేసుకునేందుకు ‘రెడీ టు యూజ్’ పదార్థాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆ పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చూసేందుకు వ్యాపారులు హానికర రసాయనాలను కలిపి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిత్యం మనం ఇండ్లలో ఎక్కువగా ఉపయోగించే కారం, పసుపు, మసాలాల్లో అల్యూమినియం సాల్ట్స్‌ను కలుపుతున్నారు. వీటి వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయని, బాధితుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఉంటున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నరాల బలహీనత,మతిమరుపు సమస్యలు
ఆలమ్ స్పైస్ కలిపిన మసాలాలను దీర్ఘకాలంపాటు ఉపయోగిస్తే నాడీవ్యవస్థ దెబ్బతిని నరాల బలహీనత, మతిమరుపు లాంటి సమస్యలు తలెత్తుతాయని, ఎదిగే పిల్లలు, వృద్ధుల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 50 ఏండ్లు దాటినవారిలో కనిపించే మతిమరుపు సమస్యలు ప్రధానంగా ఆలమ్ స్పైస్ వల్లనే ఉత్పన్నమవుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మార్కెట్లలో లభ్యమయ్యే పసుపు, కారం, మసాలాల జోలికి వెళ్లొద్దని, వాటిని ఇండ్లలోనే తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు.
అల్యూమినియం సాల్ట్స్ అంటే..
అల్యూమినియం పొటాషియం సల్ఫేట్‌ను అల్యూమినియం సాల్ట్ అని, సాధారణంగా ‘ఆలమ్ స్పైస్’ అని అంటారు. యాంటీ కేకింగ్ కెమికల్ అయిన దీన్ని మసాలా దినుసులు పాడవకుండా ప్యాకేజింగ్‌లో వాడుతారు. దీని వల్ల మసాలా దినుసుల స్వభావం, రుచి మారదు. పసుపు, కారం లాంటి పొడులు ఉండలుగా మారకుండా ఉండేందుకు ఇది దోహదపడుతుంది. దీన్ని మోతాదుకు మించి వినియోగించరాదని ఆహార భద్రతా నియమాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, ప్రస్తుతం వ్యాపారులు దీన్ని దాదాపు అన్ని రకాల నిత్యావసర వస్తువుల ప్యాకింగ్‌లో మోతాదుకు మించి వాడుతున్నారు.