రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, మార్చి 16: చేనేత కార్మికులకు అవకాశాల మేరకే ప్రభుత్వం ఆర్డర్లు ఇస్తుందని, పూర్తిగా సర్కారు మీదే ఆధారపడొద్దని చేనేత జౌళి శాఖ సంచాలకురాలు అలుగు వర్షిణి సూచించారు. సిరిసిల్లలోని చేనేత కార్మికులు, ఆసాములు ప్రైవేటు వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఆర్డర్ల సాధన దిశగా కృషి చేయాలని చెప్పారు. శనివారం నేత కార్మికుల సమస్యల పరిష్కారంపై రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి సంబంధిత కార్మిక సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అలుగు వర్షిణి మాట్లాడుతూ.. పరిశ్రమల మనుగడకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తున్నదని చెప్పారు. తమిళనాడు, సూరత్ వస్త్ర పరిశ్రమల వద్ద నుంచి ఆర్డర్లు సాధించే ప్రయత్నం చేయాలని సూచించారు. బకాయిలను సెప్టెంబర్ నాటికి అందజేస్తామని చెప్పారు. అనంతరం సిరిసిల్ల చేనేత కార్మిక సంఘం నాయకులు పలు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.