నిజామాబాద్, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆయన ఉద్యోగ అర్హత పరీక్ష కాదు కదా.. కనీసం దరఖాస్తు కూడా చేయలేదు. అయినా రేవంత్ సర్కారు ఘనకార్యంలో ఆయనకు ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు లభించింది. సీన్ కట్ చేస్తే సదరు రైతుకు రావాల్సిన రుణమాఫీ కాలేదు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన రైతు రొడ్డ సుమన్‌కు నాలుగు ఎకరాల సొంత వ్యవసాయ భూమి ఉన్నది. కుటుంబంలో ఆయనొక్కడే వారసుడు. దళిత కుటుంబానికి చెందిన రొడ్డ సుమన్‌కు మాక్లూర్‌లోని ఎస్బీఐ నుంచి రూ. 1,65,220 రుణం మంజూరైంది. డీసీసీబీ నుంచి రూ.26,801 రుణం వచ్చింది. మొత్తం రూ.1,92,021 రుణాన్ని స్వీకరించగా రైతు సమాచార పత్రంలోని రుణమాఫీ స్థితి అని పేర్కొనే 8వ నంబర్ కాలమ్‌లో కుటుంబంలో మినహాయింపులేని ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు..అంటూ నమోదు చేయడం విడ్డూరంగా మారింది. సుమన్ కుటుంబంలో రెండు రుణ ఖాతాల సంఖ్య జారీ చేయబడింది. ఆ రెండింటిలో ఏ ఒక్క ఖాతాకూ రుణమాఫీ వర్తించలేదు. దీంతో ఏవో, ఏఈవోలను ప్రశ్నించగా రికార్డుల్లో ప్రభుత్వ ఉద్యోగిగా పేర్కొన్నట్టుగా బదులిచ్చారు. పొలం పనులు చేసుకునే తాను సర్కారు ఉద్యోగిని కావడం ఏమిటని నిట్టూర్చడమే రొడ్డ సుమన్ వంతయ్యింది. ఈ తప్పును సరిదిద్దే వారెవ్వరని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం, కాల్ సెంటర్లకు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. ఎవ్వరూ స్పందించకపోవడంతో ఓపిక నశించి పోరాటానికి సిద్ధపడ్డారు. తనకు న్యాయంగా రావాల్సిన లక్షా 92వేల 21రూపాయల పంట రుణాన్ని మాఫీ చేయండి లేదంటే ప్రభుత్వ ఉద్యోగమైనా చూపించండంటూ సర్కారును సుమన్ అడుగుతున్నాడు.
నేను పదిహేనేండ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. నా కుటుంబంలో నేను ఒక్కడినే రుణం పొందాను. ఎస్బీఐ, డీసీసీబీ బ్యాం కుల్లో మొత్తం రూ.1,92,021 రుణం ఉండగా మాఫీ కాలేదు. కారణం ఏమిటని అడిగితే ప్రభుత్వ ఉద్యోగివి అంటూ బదులిస్తున్నారు. నాకై తే ఆశ్చర్యమేసింది. ప్రభుత్వం సరిచేసి రుణమాఫీ వర్తింప చేయాలి. లేదంటే ప్రభుత్వ ఉద్యోగమైనా చూపించాలని కోరుతున్నాను.