ఖైరతాబాద్, డిసెంబర్ 30 : ప్రముఖ నటుడు అల్లు అర్జున్ బౌన్సర్లు ప్రైవేట్ వ్యక్తులని, వారికి ఏ ఏజెన్సీతో సంబంధం లేదని సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు శ్రీకాంత్ జాదవ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అసోసియేషన్ చైర్మన్ డీఎస్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 840 ఏజెన్సీలు ఉన్నాయని, వాటిలో 200 ఏజెన్సీలు తమ అసోసియేసన్ పరిధిలో పని చేస్తున్నట్టు చెప్పారు. ఆయా ఏజెన్సీలకు లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు ఉన్నట్టు వెల్లడించారు. గుర్తింపు లేని ఏజెన్సీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ బౌన్సర్లకు సరైన శిక్షణ, అవగాహన లేదన్నారు. ఏజెన్సీలపై సీపీ సీవీ ఆనంద్ వెల్లడించిన అంశాలతో ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. సమావేశంలో అసోసియేషన్ వైస్ చైర్మన్ బీ మురారి గౌడ్, ప్రధాన కార్యదర్శి బాల్‌రాజ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కే దినేశ్ తదితరులు పాల్గొన్నారు.