Komati Reddy Venkat Reddy | సినీ నటుడు అల్లు అర్జున్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. సీఎం రేవంత్‌కు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తన ఇమేజ్ డ్యామేజ్ చేశారంటూ సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడి చేయడం సరికాదన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు లీగల్ టీమ్ ఒప్పుకోలేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఇమేజ్ దెబ్బతిన్నదని అంటున్నారని విమర్శించారు. తెలంగాణలో ఇక సినిమాల బెనిఫిట్ షోలు ఉండవని స్పష్టం చేశారు.
మహిళా కుటుంబానికి అల్లు అర్జున్ పరిహారం కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. సినిమాకు రూ.2వేలకోట్లు వసూలు చేశారని.. రూ.10కోట్లు ఇస్తే పోయేదేముందని ప్రశ్నించారు. ఐకాన్‌స్టార్‌ని అరెస్ట్ చేస్తారా? అని అంటున్నారని.. మనిషి చనిపోయాక ఐకాన్ స్టార్ అయితే ఏంటీ? సూపర్‌స్టార్ అయితే ఏంటీ? చట్టానికి ఎవరూ చుట్టాలు కాదన్నారు. హీరో అయినా.. ఎమ్మెల్యే అయినా చట్టానికి అందరూ సమానమేనన్నారు. బాధిత కుటుంబానికి రూ.20కోట్లు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీరు రూ.వేల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే మాకేం సంబంధం అని ప్రశ్నించారు. దేశభక్తులు, తెలంగాణపై సినిమాలు తీస్తేనే బెనిఫిట్స్ కల్పిస్తామన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా.. ఎవరు చెప్పినా వినేది లేదన్నారు. అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించారు. తన ఇమేజ్‌ని డ్యామ్ చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు.
ఈ ఘటనలో తాను ఎవరినీ నిందించదలచుకోలేదన్నారు. అయితే ఎక్కడా సీఎం రేవంత్‌రెడ్డి పేరు ప్రస్తావించకపోయినా.. కాంగ్రెస్ నేతలు మాత్రం అల్లు అర్జున్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం చేస్తున్నారు. థియేటర్లో ఓ తల్లి చనిపోయినా మానవత్వం లేకుండా రూఫ్‌టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటూ వెళ్లిపోయిన ఆ హీరో ఏం మనిషి..? ఆ వ్యక్తి హీరోనే కాదంటూ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, పోలీసుల అనుమతి లేకుండానే థియేటర్‌కు వెళ్లానని.. రోడ్‌షో చేశానంటూ చేసిన ఆరోపణలను అల్లు అర్జున్ ఖండించారు. పోలీసుల అనుమతి తీసుకున్నామని థియేటర్ యాజమాన్యం చెబితేనే అక్కడికి వెళ్లానన్నారు. తొక్కిసలాట ఘటనలో తన వ్యక్తిత్వాన్ని దుష్ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.