హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు కొన్ని నెలలుగా నిధులు విడుదల చేయకపోవటంతో అక్కడ పనిచేసే ఉద్యోగులకూ జీతాలు ఇవ్వలేని దయనీయ పరిస్థితి ఉన్నదని, సంక్షేమ పరిషత్తు కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయని పరిషత్తు మాజీ చైర్మన్ కేవీ రమణాచారి అన్నారు. విదేశి విద్యానిధి పథకం ద్వారా నిధులు మంజూరై చాలా మంది విదేశాలకు వెళ్లారని, వారికి నిధులు విడుదల కాకపోవటంతో వారంతా విదేశాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బ్రాహ్మణులు అగ్రవర్ణాలకు చెందినా అనేకమంది పేదవాళ్లు ఉన్నారని, వారి సంక్షేమం కోసం కేసీఆర్ సీఎం అయ్యాక బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. బ్రాహ్మణుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. వెంటనే విదేశీ స్కాలర్షిప్ విడుదల చేయాలని, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు కూడా నిధులు విడుదల చేయాలని కోరారు.
దీనిపై శుక్రవారం క్యాబినెట్లో చర్చించాలని వెల్లడించారు. గతంలో ఆ పరిషత్తుకు చైర్మన్‌గా పనిచేసిన తాను ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే మనసు విలవిలలాడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాహ్మణ పరిషత్తు ద్వారా 5 వేల మందికి వ్యాపార యూనిట్స్‌ను ఏర్పాటు చేశామని, వారిలో 1,879 మందికి నిధులు విడుదల చేయాల్సి ఉన్నదని తెలిపారు. వీటికి రూ.15 కోట్లు, విదేశి విద్యానిధి పథకానికి రూ.30 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నదని వివరించారు. పరిషత్తుకు కొత్త పాలకవర్గం ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే బ్రాహ్మణుల కోపానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
ఇప్పటికే పలు సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డికి బుధవారం లేఖ రాశానని వెల్లడించారు. 2025లో మహాకవి దాశరథి శతజయంతి ఉన్నదని, వచ్చే జూలై 22 నుంచి ఏడాది పాటు శత జయంతిని నిర్వహించాలని విన్నవించారు. ఎమ్మెల్సీ సురభి వాణీదేవి మాట్లాడుతూ.. బ్రాహ్మణుల గురించి ఆలోచించింది కేసీఆర్ మాత్రమేనని అన్నారు. ప్రభుత్వాలు మారితే పథకాలు మం చిగా అమలు కావాలని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం మారితే పథకాలు ఆగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ మాట్లాడుతూ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు నిధులు రెట్టింపు చేస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో చెప్పిందని, వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.