వరంగల్, నవంబర్ 3: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కాంగ్రెస్ సర్కారుకు చేతకావడం లేదని, అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలో తెలంగాణ ప్రజల్లో ఆనందం కరువైందని, సీఎం కుటుంబానికి, కోటరీకి మాత్రమే వెలుగులు నింపారని బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. ఆదివారం హనుమకొండలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్లాక్మెయింలింగ్, భూదందాలు, సెటిల్మెంట్లు, కోటరీకి దోచిపెట్టడంపైనే సీఎం రేంవత్రెడ్డి దృష్టి ఉందని విమర్శించారు.
హామీలను అమలు చేయడం, ప్రజల సమస్యలను పరిష్కరించడంపై ఎలాంటి శ్రద్ధ లేదని మండిపడ్డారు. రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు ఇలా అన్నివర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అభయ హస్తం ఇప్పుడు శూన్య హస్తం, భస్మాసుర హస్తంగా మారిందని విమర్శించారు. ఎన్నికల మ్యానిపెస్టోలో చెప్పినట్టు రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటలకు బోనస్, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు వంటి హామీలను అమలు చేయని సీఎంకు రైతుల వద్దకు వెళ్లే దమ్ముందా? అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే గద్దె దిగిపోవాలని, కుంటి సాకులు చెప్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.