హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అవినీతిపై ఆధారాలతో సహా బయటపెడుతున్నా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మాహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. మంత్రి తప్పించుకు తిరుగుతూనే తనపై కేసు పెట్టించారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి 18 ప్రశ్నలతో లేఖ రాశారు. మిల్లర్లు బియ్యం ఇవ్వకుం డా మోసం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదని ఆ లేఖలో ప్రశ్నించారు.
మిల్లర్ల నుంచి రూ.22 వేల కోట్ల బకాయిలు ఎందుకు వసూ లు చేయడం లేదని, లోపాయికారి ఒప్పందం ఏమిటని నిలదీశారు. జనవరి 25న జీవో రిలీజ్ చేసి, అదేరోజు కమిటీ వేసి, గైడ్‌లైన్స్ ప్రిపేర్ చేసి, అదేరోజు టెండర్ ప్రాసెస్ చేశారని, ఒకరోజులోనే అంత హడావుడిగా ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మే15 వరకు సీఎంఆర్ రైస్ కొంటామని కేంద్రం చెప్పినా టెండర్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.
టెండర్లో రేటు ఫైనల్ చేశాక జలసౌధలో బిడ్డర్లు, కాంట్రాక్టర్లను పిలిపించి మంత్రి, కమిషనర్ చేపట్టిన చీకటి ఒప్పందం నిజం కాదా? అని ప్రశ్నించారు. రూ.2007ను రూ. 2,223కు పెంచి నాలుగు ఇన్స్టాల్మెంట్లలో బిడ్డర్ దగ్గర నుంచి రైస్ మిల్లర్లు కొనుగోలు చేసినట్లు రాయించుకున్నది వాస్తవం కాదా? అదనంగా రూ.216 రాయించడం వల్ల 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి అదనంగా రూ.800 కోట్లు వసూ లు కానున్నాయని, ఆ డబ్బు ఎవరి ఖాతాలోకి వెళ్లనుందో మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు.