Bandi Bhageerath |హైదరాబాద్, మే 18(నమస్తే తెలంగాణ) : బండి భగీరథ్ పోక్సో కేసులో అతని తండ్రి, కేంద్ర సహాయ మంత్రి కూడా నిందితుడని, అతనిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పోక్సో కేసు నమోదుకు ముందు, తర్వాత.. బాధితులను బెదిరించడం, నిందితుడిని కాపాడటం, పోలీసులకు దొరక్కకుండా దాచడం, కేసు విత్‌డ్రా కోసం సెటిల్మెంట్ చేయడం పోక్సో చట్టం ప్రకారం నేరం. ఈ కేసులో ప్రధాన నిందితుడిని 9రోజుల వరకూ దాచిన అతని తండ్రి, సెటిల్మెంట్ చేసిన మాజీ జర్నలిస్ట్, ప్రస్తుత బీజేపీ నేత సంగప్ప కూడా నిందితులే అని పోలీసు వర్గాలు సైతం చెబుతున్నాయి. తమను ఇంటికి పిలిచి బెదిరించారని సాక్షాత్తూ బాధితురాలి తల్లి 161ప్రకారం స్టేట్మెంట్ ఇచ్చింది.
పోక్సో కేసు నమోదైన తర్వాత కూడా నిందితుడి తండ్రి కరీంనగర్లో మాట్లాడుతూ తమ జోలికొచ్చిన వారి అంతుచూస్తానని వేల మంది సాక్షిగా నిర్భయంగా, బహిరంగంగా బెదిరించడం కూడా నేరం కిందకే వస్తుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. భగీరథ్‌ను దాచడం, బెదిరించడం వంటి ఆరోపణ లు ఎదుర్కొంటున్న నిందితుడి తండ్రిని ఏ2గా, సెటిల్మెంట్ చేసినట్టు ఆరోపణలున్న మాజీ జర్నలిస్ట్ సంగప్ప ఏ3గా ఉంటారని న్యాయ నిపుణులు, పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ కేసులో పోలీసు నోటీసులు అందుకున్న మేనమామ పాత్ర తేలాల్సి ఉంది. కాంగ్రెస్-బీజేపీల మైత్రి కారణంగా వారిపై కేసు లు పెట్టడం లేదని తెలుస్తున్నది. సెక్షన్ 16, 17, 19, 21 కింద వారిని కూడా నిందితులుగా చేర్చాల్సిందేనని న్యాయ నిపుణులు అంటున్నారు. తన కొడుకును కాపాడిన కేంద్ర మంత్రిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
1) సెక్షన్ 16 & 17 : నిందితుడితో చేతులు కలిపి, బాధితులను భయపెడుతూ, కేసును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తే.. ఆ నేరానికి సహకరించిన వారిని కూడా నేరస్తులుగానే పరిగణిస్తారు. పోక్సో నేరగాడికి సహాయం చేసినా, నేరం చేయడానికి ఉసిగొల్పినా, నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నించినా.. వారు కూడా అసలు నేరస్తుడితో సమానంగా సెక్షన్ 16 కింద శిక్షార్హులవుతారు. ప్రధాన నిందితుడికి ఎంత శిక్ష పడుతుందో, అంతే సమానమైన శిక్ష పడే అవకాశం ఉంది. పోక్సో కేసుల్లో బాధితులను బెదిరించడం లేదా పంచాయితీలు చేసి కేసులను నిర్వీర్యం చేయాలని చూడటం చట్టరీత్యా క్షమించరాని నేరాలు.
2) సెక్షన్ 19 & 21: చిన్నారులపై లైంగిక దాడి జరిగినట్టు తెలిస్తే ఎవరైనా సరే పోలీసులకు సమాచారం అందించాలి. అలా కాకుండా నిందితుడికి అనుకూలంగా ఉంటూ సమాచారాన్ని దాచిపెడితే.. సెక్షన్ 21కింద 6 నెలల నుంచి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష పడుతుంది.
3) బీఎన్ఎస్ సెక్షన్ 351 : బాధితులను/సాక్షులను చంపేస్తామని బెదిరించడం లేదా కేసు విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేయడం బీఎన్ఎస్ సెక్షన్ 351 కిందకు వస్తుంది. ప్రాణాపాయం కలిగిస్తామని బెదిరిస్తే 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా, లేదా రెండూ విధించవచ్చు.
4) బీఎన్ఎస్ సెక్షన్ 249 & 238: పోలీసులకు దొరకకుండా నిందితుడికి ఆశ్రయం కల్పించడం, దాచడం బీఎన్ఎస్ సెక్షన్ 249 కింద నేరం. నిందితుడికి పడే శిక్షను బట్టి, అతడిని దాచిన వారికి 3 నుంచి ఏడేండ్ల వరకు శిక్ష పడుతుంది. కేసును నీరుగార్చేందుకు సాక్ష్యాలను రూపుమాపడం/తప్పుడు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తే బీఎన్ఎస్ సెక్షన్ 238 కింద శిక్ష పడుతుంది.