హైదరాబాద్, ఆక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి తమ్ముళ్లు తెలంగాణలోని భూములను కబ్జా చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత (Konda Susmitha) తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ మధ్య నెలకొన్న వివాదం.. సెటిల్మెంట్ల ఆరోపణల వ్యవహారంలో కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌ను ప్రభుత్వం తొలగించడం, సురేఖ ఇంటిని టాస్క్‌ఫోర్స్ పోలీసుల ముట్టడి వరకు సాగిన హైడ్రామాలో సుస్మిత కీలక అంశాలను బయటపెట్టారు. ‘మంచిరేవులలో విల్లాలు కట్టుకున్న కొందరు దారి కోసం ఎండోమెంట్ భూమి అడిగారు. భూమి ఇస్తే బదులుగా ప్రైవేట్ ల్యాండ్ ఇస్తామని చెప్పారు. దీంతో ఈ ఫైల్‌పై మంత్రి సురేఖ సంతకం చేశారు. కానీ అప్పుడు జపాన్‌లో ఉన్న రేవంత్‌రెడ్డి ఫైల్‌ను ఆపించారు. రేవంత్ సోదరులు ఆ భూములను అక్రమించుకోవాలని చూస్తున్నరు. అందుకు ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి సహకరిస్తున్నరు. అందుకే మా అమ్మ సంతకం పెట్టిన ఫైల్‌ను ఆపేశారు’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘మా అమ్మ పరిధిలోని దేవాదాయశాఖలో మేడారం పనుల టెండర్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తనకు కావాల్సిన వాళ్లకు ఇచ్చుకున్నారు. సదరు టెండర్ ఫిజికల్ బిడ్ తెరిస్తే మా వాళ్లకు టెండర్ వచ్చింది. మా అమ్మకు ఫోన్ చేసి విత్‌డ్రా చేసుకోవాలని బెదిరించిన్రు. మేం చేసుకోబోమని చెప్తే.. మాకు తెలియకుండా బలవంతంగా గుంజుకున్నరు. ఇప్పుడు ఆ టెండర్‌ను ఆర్అండ్బీ శాఖకు బదిలీ చేయించుకున్నరు’ అని వెల్లడించారు.
మమ్మల్ని కొందరు మంత్రులు వేధిస్తున్నరని ఏడువాల్నా.. ఏం జేయాలని అడగాల్నా.. మా అమ్మనుద్దేశించి ఈసడింపుగా మాట్లాడొద్దని రేవంత్‌రెడ్డి కాళ్లు పట్టుకోవాలా.. ఏంజెప్పాలండి.. చాలా బాధాకరం.. ఎందుకంటే మా అమ్మ ఫైర్‌బ్రాండ్ అయి ఉండి.. ఎన్నిసార్లు కంటతడి పెట్టుకుంటున్నదో ఒక కూతురుగా నాకు తెలుసు
-సుస్మిత, కొండా సురేఖ కూతురు
రాజకీయాల్లో 40 ఏండ్లుగా ఉన్న కొండా కుటుంబంపై సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మంత్రి పొంగులేటితోపాటు, వరంగల్ జిల్లాకు చెందిన నేతలు బస్వరాజు సారయ్య, కడియం శ్రీహరి, గుండు సుధారాణి లాంటి నేతలందరూ పగబట్టినట్టుగా వ్యవహారిస్తున్నారని తెలిపారు. ‘మాపై కక్ష కట్టిన రెడ్డి నాయకులు.. బీసీలను తొక్కాలని చూస్తున్నారు. అమ్మ, నాన్న ఇంట్లో లేకున్నా… ఒంటరిగా ఉన్న నా ఇంటి మీదకు పోలీసులను పంపించాల్సిన తప్పు ఏం చేశామనేది తెలియడం లేదు’ అని చెప్పారు. కాంగ్రెస్‌లోని ముఖ్యమంత్రి, రెడ్డి మంత్రులు కలిసి బీసీ లీడర్లను తొక్కేందుకు యత్నిస్తున్నారని సుస్మిత ఆరోపించారు. ఇప్పుడు ఎక్స్టార్షన్ కేసంటూ చెప్తున్నరని, సుమంత్‌కు పిస్టల్ అంటగడుతున్నరని చెప్పారు. ఆర్మ్స్ యాక్ట్ కింద తన తండ్రి కొండా మురళిపై కేసు పెట్టేందుకు కుట్ర చేస్తున్నరని అనుమానం వ్యక్తంచేశారు. తన తల్లిదండ్రులకు ఏమి జరిగినా పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిదేనని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి అన్నదమ్ములు తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డికి గన్‌మెన్‌ను ఎందుకిచ్చారని సుస్మిత ప్రశ్నించారు. వారు కాంగ్రెస్‌కు ఏం చేశారని.. ఈ గౌరవమర్యాదలు అంటూ సూటిగా నిలదీశారు. సొంతపార్టీ నేతలనే గెంటివేసేలా వ్యవహరించడం, కనీస భద్రత కల్పించకుండా ఇంటిమీదకు టాస్క్‌ఫోర్స్ పోలీసులను పంపించి, మహిళా పోలీసు అధికారులను ఎందుకు తీసుకువచ్చారనే విషయాన్ని కూడా చెప్పడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. హనుమకొండలోని తమ నివాసం వద్ద ఔట్ పోస్ట్‌ను కూడా తొలగించారని ఆవేదన వ్యక్తంచేశారు.
కొండా కుటుంబంపై వేం నరేందర్‌రెడ్డి, పొంగులేటి, బస్వరాజు సారయ్య, కడియం శ్రీహరి, గుండు సుధారాణి లాంటి నేతలందరూ పగబట్టినట్టుగా వ్యవహారిస్తున్నారు. మాపై కక్ష కట్టిన రెడ్డి నాయకులు.. బీసీలను తొక్కాలని చూస్తున్నారు. అమ్మ, నాన్న ఇంట్లో లేకున్నా… ఒంటరిగా ఉన్న నా ఇంటి మీదకు పోలీసులను పంపించాల్సిన తప్పు ఏం చేశామనేది తెలియడం లేదు
దక్కన్ సిమెంట్ ప్రతినిధులను పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి డబ్బుల కోసం మాజీ ఓఎస్డీ సుమంత్ బెదిరింపులకు పాల్పడ్డారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారని, ఆ ఫిర్యాదు కాపీ ఎందుకు బయటపెట్టడం లేదని సుస్మిత ప్రశ్నించారు. ఇదే విషయాన్ని స్వయంగా ఉత్తమ్‌కు ఫోన్ చేసి అడిగితే, తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారని వెల్లడించారు. అలాంటప్పుడు సుమంత్ దక్కన్ సిమెంట్స్ వాళ్లను బెదిరించారని చెప్పడం వెనుక కుట్ర ఏమిటో తెలియాల్సిన అవసరముందని చెప్పారు. దక్కన్ సిమెంట్ విషయంలో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని.. ఆయన సన్నిహితుడు రోహిన్‌రెడ్డి అనే వ్యక్తి వచ్చారని తెలిపారు. ఆ వ్యవహారంలో సుమంత్‌ను పిలిపించుకుని విషయం తెలుసుకున్నారని వివరించారు. ‘దక్కన్ సిమెంట్ విషయంలో గన్‌తో బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో అసలు గన్ ఇచ్చిందే రేవంత్‌రెడ్డి, ఆ గన్ రోహిన్‌రెడ్డి తెచ్చి దక్కన్ వాళ్లను డబ్బుల కోసం బెదిరించారు. ఈ కేసును మా మనిషి సుమంత్ మీద తోసి, మా అమ్మ, నాన్న మీదకు డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. మా మీదకు వస్తే రెడ్డిల పనిచేప్తాం. వేం నరేందర్‌రెడ్డి సీఎం ప్రమేయంతోనే బీసీ మహిళపై రాజకీయ దాడి జరుగుతున్నది’ అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
మా అమ్మ పరిధిలోని దేవాదాయశాఖలో మేడారం పనుల టెండర్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తనకు కావాల్సిన వాళ్లకు ఇచ్చుకున్నారు. ఫిజికల్ బిడ్ తెరిస్తే మా వాళ్లకు టెండర్ వచ్చింది. మా అమ్మకు ఫోన్ చేసి విత్‌డ్రా చేసుకోవాలని బెదిరించిన్రు. మేం చేసుకోబోమని చెప్తే.. మాకు తెలియకుండా బలవంతంగా గుంజుకున్నారు.
పది, పదేహేను రోజుల క్రితం ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో జరిగిన మీటింగ్‌లో కొండా సురేఖను అవమానించారంటూ సుస్మిత చెప్పారు. ‘ఖర్గే, అందరు మంత్రులు ఉన్నప్పుడు మా అమ్మ.. అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లెమ్ అవుతున్నది.. ఆ విషయం మీకు పీఏలు చెప్తున్నరో లేదో తెలియదని చెప్పింది. వెంటనే రేవంత్‌రెడ్డి.. ఖర్గేతో హిందీలో మాట్లాడుతూ ఆమె ఎదో ఒకటి చెప్తది. పది పిటిషన్లు పట్టుకొని వస్తది. ఈ పనిజేయని అంటది.. ఆ పని చేయమని అంటది. అందుకే నేను పట్టించుకోను’ అని గదమాయించారని గుర్తుచేశారు. ఆ రోజు మా అమ్మ ఫోన్ చేసి ఏడిస్తే అప్పటికప్పుడు నేను ఢిల్లీకి పోయి ఓదార్చాను’ అని సుస్మిత చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి తమపై పగబట్టి కక్ష సాధిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడే తాము ప్రశాంతంగా ఉన్నామని, కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ మీదే కుట్రలు చేస్తున్నారని సుస్మిత ఆవేదన వ్యక్తంచేశారు.
దక్కన్ సిమెంట్ విషయంలో గన్‌తో బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో అసలు గన్ ఇచ్చిందే రేవంత్‌రెడ్డి, ఆ గన్ రోహిన్‌రెడ్డి తెచ్చి దక్కన్ వాళ్లను డబ్బుల కోసం బెదిరించారు. ఈ కేసును మా మనిషి సుమంత్ మీద తోసి, మా అమ్మ, నాన్న మీదకు డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. మా మీదకు వస్తే రెడ్డిల పనిచేప్తాం
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేంద్రెడ్డిని ఉద్దేశించి కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. సీఎం, మంత్రులను ట్రోల్ చేస్తూ కడిగి పారేస్తున్నారు. ‘కరప్షన్‌కు కాంగ్రెస్ కేరాఫ్’, ‘హస్తం పార్టీకి ఓటేస్తే నిండా ముంచింది’, ‘ఒక్కనాటి పొరపాటుకు ఐదేండ్లు బాధపడాల్సి వస్తున్నది’ అంటూ ట్రోల్ చేస్తూ చెడుగుడు ఆడుకుంటున్నారు.
‘మమ్మల్ని కొందరు మంత్రులు వేధిస్తున్నరని ఏడువాల్నా.. ఏం జేయాలని అడగాల్నా.. మా అమ్మనుద్దేశించి ఈసడింపుగా మాట్లాడొద్దని రేవంత్‌రెడ్డి కాళ్లు పట్టుకోవాలా.. ఏంజెప్పాలండి.. చాలా బాధాకరం.. ఎందుకంటే మా అమ్మ ఫైర్‌బ్రాండ్ అయి ఉండి.. ఎన్నిసార్లు కంటతడి పెట్టుకుంటున్నదో ఒక కూతురుగా నాకు తెలుసు’ అంటూ సుస్మిత వ్యాఖ్యానించారు. గురువారం తెల్లవారుజామున ఆమె మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద, అలాగే సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన వీడియోల్లో మాట్లాడారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు ఫైల్ తీసుకెళ్లమ్మా అని అడిగితే.. నేను వెళ్లను.. ఆయన ఎట్లపడితే అట్ల మాట్లాడతరని నాకు ఎన్నోసార్లు చెప్పుకున్నది’ అని వాపోయారు. బీసీలంటే రేవంత్‌రెడ్డికి చులకన భావం ఎందుకు? అని ఆవేదన వ్యక్తంచేశారు.