నయీంనగర్, సెప్టెంబర్ 11 : తమ ఇండ్లకు వేసిన తాళాలను పగులగొట్టి రెవెన్యూ అధికారులు దౌర్జన్యం చేశారంటూ బాధితులు వాపోయారు. బాధితుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌కు చెందిన ముస్కు రాజమౌళి, విష్ణువర్ధన్, వసంత్‌కుమార్, అన్నపరెడ్డి అపర్ణ వేర్వేరుగా కట్టుకున్న మూడు ఇండ్లు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని గుర్తుతెలియని వ్యక్తి పిటిషన్ ఇచ్చాడు. దాని ఆధారంగా హసన్‌పర్తి తహసీల్దార్ చల్లా ప్రసాద్‌పై ఒత్తిడి చేయడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు ఇండ్ల తాళాలను పగులగొట్టి, విలువైన వస్తువులను సోదా చేసి, అధికారుల తాళాలు వేశారు. అధికారుల తీరుపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
30 ఏండ్లుగా ఇక్కడే నివాసముంటున్నామని, 2000 సంవత్సరంలో ఐలోని కొమురయ్య వద్ద సర్వే నంబర్ 498లో రెండు ఎకరాలు కొనుగోలు చేశామని, 2015-16లో బావితోపాటు మొత్తం పది గుంటల వరకు రోడ్డుకింద పోవడంతో డబ్బులు తమ ఖాతాలో పడినట్టు బాధితులు తెలిపారు. అధికారులు మాత్రం 516 సర్వే నంబర్ అంటూ మూడు ఇండ్లకు తాళాలు వేయడంతో సదరు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయితే తహసీల్దార్ తీరుపై బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. 30 ఏండ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని, రింగ్‌రోడ్డు పోతే తమకు డబ్బులు కూడా వచ్చాయని తెలిపారు. తమకు సమీపంలోనే దాదాపు 500కుపైగా ఇండ్లు ఉన్నాయని, తాము తప్పు చేస్తే మిగతా వారు చేయలేదా? ఒక వేళ అదే అయితే మిగతా వారిపై ఆ తహసీల్దార్‌కు ఎందుకంత ప్రేమ అంటూ బాధితులు వాపోయారు.
వారు కట్టుకున్న ఇండ్లు ప్రభుత్వ భూములో ఉన్నాయంటూ నోటీసులు జారీ చేశాకనే తాళాలు వేశాం. ఆర్డర్ కాపీ తీసుకుని నాలుగు రోజులైంది. పొజిషన్ టేకప్ చేసుకోవడానికి ఫోన్ చేస్తే రావడం లేదు. పంచనామా చేసి తాళాలు వేశాం.