హైదరాబాద్ మే 31(నమస్తేతెలంగాణ): ‘తటస్థత, నిష్పాక్షికత అనే మాయ నుంచి బయటపడ్డం. తెలంగాణ అనే పదాన్ని నిషేధించిన రోజుల్లోనే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజేఎఫ్)ను ఏర్పాటు చేసుకున్నం. భాష, సాహిత్యంలో వివక్షను బద్దలు కొట్టినం. నిర్బంధాలను ఎదురించి, ఆస్తిత్వ ఆకాంక్ష కోసం ముందుకు నడిచినం’ అని టీజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లం నారాయణ పేర్కొన్నారు. టీజేఎఫ్ స్థాపించి 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని జలవిహార్‌లో రజతోత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాదిమంది జర్నలిస్టులు తరలివచ్చారు. ముందుగా ఇటీవల మరణించిన సీనియర్ జర్నలిస్టులు మిర్యాల్‌కార్ సునీల్, మునీర్‌కు నివాళులు అర్పించారు. వారి కుటుంబసభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు పత్రికాధిపతులుగా ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన జర్నలిస్టులుగా అనేక గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రజాస్వామిక ఆకాంక్షగా భావించి ఉద్యమానికి నడుంబిగించామని తెలిపారు. 2001 మే 31న ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టులతో చిన్న సమావేశం ఏర్పాటు చేసి ‘ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెస్’ పేరుతో ఓ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకొన్నామని, ఆ తర్వాత టీజేఎఫ్ను ఆవిష్కరించుకున్నామని గుర్తుచేశారు. యూనివర్సిటీల్లోని బుద్ధిజీవులు, విద్యార్థులు, లాయర్ల వెంట నడిచామని, ప్రజా సమూహాలకు నాయకత్వం వహించామని, అటు రాజకీయ పార్టీలు, ఇటు ప్రజాసంఘాల మధ్య సమన్వయ సాధనలో కీలక భూమిక పోషించామని చెప్పారు.
రెండు వేల మంది పాత్రికేయులతో ప్రత్యేక రైలులో ఢిల్లీకి వెళ్లి ఒక పెద్ద మోర్చా జరిపామని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ పదం ఉచ్చరించలేని రోజుల్లోనే లాయర్లు, విద్యార్థులు, ఉద్యోగులను పిలిచి మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేశామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపామని వివరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో దీక్షకు దిగిన విద్యార్థులకు సంఘీభావంగా నిలిచామని గుర్తు చేశారు. రోజుల తరబడి టెంట్లు వేసుకొని వారి వెంట ఉండి పోరాడామని తెలిపారు.
జలీల్‌ఖాన్ ఆటోలో విద్యార్థుల కోసం ఆహారం తీసుకెళ్లామని గుర్తు చేసుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్బంధకాండను ఎదిరించి సింగరేణి ఏరియాల్లో యాత్ర చేశామని పేర్కొన్నారు. ఇలా అనేక చిక్కుల మధ్య ఆస్తిత్వ ఉద్యమం వెంట నడిచి, సఫలమయ్యేదాకా వెంటనడిచిన ఘనత టీజేఎఫ్కే దక్కిందని చెప్పారు. టీజేఎఫ్ రజతోత్సవాలను ఏడాదిపాటు నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది మే 31లోగా టీజేఎఫ్ విజయాలు, ఉద్యమంలో పోషించిన పాత్రను గుర్తుచేసుకొనేలా ఓ పుస్తకాన్ని తీసుకొస్తామని అల్లం నారాయణ ప్రకటించారు. చరిత్రను మననం చేసుకొనేందుకు వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన వేలాదిమంది జర్నలిస్టులకు అభినందలు తెలిపారు.
ఉద్యోగ సంఘాలు, టీజేఎఫ్ ఏకమై ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ముఖ్యభూమిక పోషించాయని బీఆర్ఎన్ నేత దేవీప్రసాద్ గుర్తుచేశారు. సంఘం పెట్టేందుకు భయపడే రోజుల్లో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం పురుడుపోసుకున్నదని చెప్పారు. ఆనాడు ఉద్యోగులకు కొన్ని రాజకీయ పార్టీలు సహకరించకున్నా టీజేఎఫ్ మాత్రం అండగా నిలిచిందని గుర్తు చేశారు. నాడు సమైక్య పాలకులను ఎదురించేందుకు జేఏసీ ఏర్పాటు చేసినట్టుగానే ఇప్పుడు పాలకుల పనితీరును ప్రశ్నించేందుకు మరో జేఏసీ ఏర్పాటు చేయాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్ అడువుల్లో ఆదివాసీ, మావోయిస్టులపై కేంద్రం సాగిస్తున్న మారణకాండను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో టీజేఎఫ్ పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. తెలంగాణ భావజాల వ్యాప్తిలో యూనియన్ ముందువరుసలో నిలిచిందని చెప్పారు. తెలంగాణ పోరాట చరిత్రను పుస్తకరూపంలోకి తీసుకురావాల్సిన అవశ్యకత ఉన్నదని, ఇందుకు జర్నలిస్టులే పూనుకోవాలని కోరారు. విమలక్క మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న దమన కాండను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామికవాదులు కేంద్రం తీరును వ్యతిరేకించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం, ైస్కెబాబా, దుర్గం భాస్కర్, ప్రహ్లాద్, రమేశ్హాజారే, రాజారాంయాదవ్, కిశోర్, కట్ట కవిత తదితరులు పాల్గొన్నారు.