హైదరాబాద్, మే 5 (నమస్తేతెలంగాణ): టీజీఎస్ఆర్టీసీ జేఏసీ పేరుతో సమ్మె విచ్ఛిన్నానికి పాల్పడేందుకు యత్నిస్తున్న అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ కార్మిక ద్రోహి అని తెలంగాణ ఆర్టీసీ జాక్ నేతలు ధ్వజమెత్తారు. ఈ నెల 6న అర్ధరాత్రి నుంచి సమ్మె తప్పదని, సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చింది. సోమవారం సాయంత్రం ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, కో-చైర్మన్ హనుమంతు ముదిరాజ్, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి, జేఏసీ కన్వీనర్ ఎండీ మౌలానా, కో-కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, బీ యాదగిరి మీడియాతో మాట్లాడారు. టీజీఎస్ఆర్టీసీ జేఏసీ పేరుతో అశ్వత్థామరెడ్డి.. సమ్మెకు దూరంగా ఉంటున్నామని ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2019లో లోపాయికారి ఒప్పందంతో ఆర్టీసీ ఉద్యోగులను, ఆర్టీసీని అశ్వత్థామరెడ్డి సర్వనాశనం చేశాడని విమర్శించారు. అలాంటి కార్మిక ద్రోహి మాటలను ఎవ్వరూ నమ్మవద్దని హితవు పలికారు. 7న జరిగే సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఉద్యోగుల విలీనం, ఇతర సమస్యలను ఐక్యంగా సాధించుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. కార్మికులు అయోమయానికి గురికాకుండా సమ్మెలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కార్మిక హకులను ప్రభుత్వానికి తాకట్టుపెట్టిన అశ్వత్థామరెడ్డి వంటి ద్రోహులకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
సమ్మెకు దిగితే ఎస్మా తప్పదు! ; సమ్మె యోచనను విరమించుకోండి
హైదరాబాద్, మే 5 (నమస్తేతెలంగాణ): ‘టీజీఎస్ ఆర్టీసీలో ఎస్మా చట్టం అమలులో ఉన్నది.. ఈ చట్టం ప్రకారం సమ్మెలు నిషేధం.. సంస్థ నిబంధనల మేరకు చట్టవ్యతిరేకమైనది.. సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా, విధులకు ఆటంకం కలిగించినా బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తప్పవు’ అని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరికలు జారీచేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెను నిలువరించే లక్ష్యంగా సంస్థ యాజమాన్యం ఎస్మా బలప్రయోగం విధించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం పేరుతో సోమవారం సాయంత్రం ఒక బహిరంగ లేఖను విడుదల చేసింది. ఆర్థికంగా ఇబ్బందులున్నా, ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న 2017 పీఆర్సీని 21 శాతం ఫిట్మెంట్తో 2024 మే నెలలో యాజమాన్యం అందించిందని సంస్థ పేర్కొన్నది. పెండింగ్‌లో ఉన్న 10 డీఏలను 2019 నుంచి దశలవారీగా విడుదల చేసినట్టు తెలిపింది. ఆర్పీఎస్-2013 బాండ్లకు సంబంధించిన రూ.280 కోట్లను చెల్లించినట్టు వెల్లడించింది. గత మూడున్నరేండ్లుగా ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలను ఇస్తున్నట్టు తెలిపింది.