హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): చర్లపల్లి, ఘట్కేసర్ రైల్వేస్టేషన్లలో అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని హైదరాబాద్ ఈస్ట్ అండ్ నార్త్ అసోసియేషన్స్ ఫర్ డెవలప్మెంట్ (హెడ్) డిమాండ్ చేసింది. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని కోరింది. హైదరాబాద్‌లోని హెడ్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశానికి తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వివిధ ప్రాంతాల నుంచి హాజరైన 52 అసోసియేషన్ల ప్రతినిధులు పలు తీర్మానాలు చేశారు. పెరిగిన జనాభా, నూతనంగా ఏర్పాటైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల దృష్ట్యా తక్షణమే చర్లపల్లి, ఘట్కేసర్ స్టేషన్లలో అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని, ఔటర్ రింగ్ రోడ్డు ముఖద్వారంగా ఉన్న ఘట్కేసర్కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. సమావేశంలో మనోరంజన్‌రెడ్డి, నిర్మల, ప్రభాకర్‌రెడ్డి, ప్రభుదాస్, సత్యనారాయణ, అశోక్‌రెడ్డి, పండు, యశ్వంత్, వెంకటేశ్, రాధాకిషన్‌రావు, అజీముద్దీన్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.