హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్‌కు వస్తున్నవారంతా సొంత ఇండ్లవైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడి వాతావరణం, సుస్థిర ప్రభుత్వం, అభివృద్ధి, శాంతిభద్రతలు, మెరుగైన మౌలిక వసతులు తదితర అంశాలు వారిని ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై కంటే హైదరాబాద్‌లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఉత్తమమన్న భావన సర్వత్రా వ్యక్తమవుతున్నది. దీంతో తెలుగు రాష్ర్టాల వారితోపాటు ఉత్తరాది రాష్ర్టాలకు చెందిన అనేకమంది హైదరాబాద్‌లో స్థిరపడుతున్నారు.
ఉమ్మడి ఏపీలో వేసవి వచ్చిదంటే జనం గంటల తరబడి విద్యుత్తు కోతలతో అల్లాడిపోయేవారు. కానీ, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణలో విద్యుత్తు కోతలే లేవు. కృష్ణా, గోదావరి, మంజీరా, సింగూరు నదులతోపాటు గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల నుంచి హైదరాబాద్‌కు పుష్కలంగా తాగునీరు సరఫరా అవుతున్నది. స్వరాష్ట్రంలో రోడ్లు, డ్రైనేజీలు తదితర మౌలిక వసతులు ఎంతో మెరుగుపడ్డాయి. హైదరాబాద్ కోర్ సిటీ నుంచి ఓఆర్ఆర్ను అనుసంధానించేలా ప్రభుత్వం 33 రేడియల్ రోడ్లను నిర్మించడం.. దేశంలో ఎక్కడా లేనంత అత్యున్నత ప్రమాణాలతో 69 కి.మీ. మేర మెట్రో రైలు సేవలు, పెద్ద సంఖ్యలో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి రావడంతో శివారు ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు లక్షల మంది ఆసక్తి చూపుతున్నారు.