Telangana | సూర్యాపేట జిల్లా ; సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలంలోని 2019లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 9 చెక్ డ్యామ్‌లు నిర్మించింది. ఒక్కో చెక్ డ్యామ్ కింద 300 ఎకరాల ఆయకట్టుకుపైగా సాగయ్యేది. దాదాపు 3వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇవ్వడంతో చెరువులన్నీ నిండటంతోపాటు చెక్‌డ్యామ్‌ల్లోనూ పుష్కలంగా నీటి నిల్వ ఉండేది. దీంతో నాలుగేండ్లుగా రెండు పంటలకు పుష్కలంగా నీరు అందింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నీళ్లు లేక మండలంలోని చెక్‌డ్యామ్‌లు అన్నీ ఎండిపోయాయి. గతంలో ఏప్రిల్, మే నెలల్లోనూ నిండుగా నీళ్లు ఉన్న ఏపూరు గ్రామ పరిధిలోని చాకలిబండ చెక్ డ్యామ్‌లో ఇప్పుడు రాళ్లు తేలాయి. దీని పరిధిలోని వరి పైర్లు పొట్ట దశలో ఎండిపోతున్నాయి. చాలాచోట్ల ఇప్పటికే పంటలను పశువుల మేతకు వదిలి పెట్టారు.
ఎండిన వరి.. గొర్రెలకు సరి
ఇల్లెందు, మార్చి 12 ; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రోళ్లపాడు ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను వేసింది. ఆ ప్రాజెక్టును నమ్ముకొని ఆయకట్టు రైతులు 120 ఎకరాల్లో వరి సాగు చేశారు. కానీ ప్రాజెక్టు తూము గేటు నుంచి నీళ్లు లీకవడం.. ప్రభుత్వం వెంటనే స్పందింకపోవడంతో నీళ్లు అందక 80 ఎకరాలకు పైగా పొలాలు నెర్రెలు వారాయి. దీంతో తమ పొలాల్లో పశువులను మేపుతున్నారు.
మక్క రైతు గోస..
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామంలో ఎండిపోయిన మక్కజొన్న పంట ఇది.. సకాలంలో నీరందకపోవడంతో పంట ఎండిపోయింది. దీంతో దిగుబడి రాక అన్నదాత ఆందోళనలో పడ్డాడు. ప్రభుత్వం సాగునీరందించేందుకు చర్యలు తీసుకోకపోవడమే తమ పంటలు ఎండిపోవడానికి కారణమని అక్కడి రైతాంగం మండిపడుతున్నది.
కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ కరువు
మోతె, మార్చి 12 ; ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం బీక్యాతండాలో ఎండిపోయిన పంటలను బుధవారం పరిశీలించారు. సర్కారు తీరుపై మండిపడ్డారు. ఎకరానికి రూ.30 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
బొట్టు.. బొట్టు.. పంటకు ఒడిసిపట్టు
సోన్, మార్చి 12 ; స్వర్ణ ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టు 1400 ఎకరాలు ఉండగా.. 400 మంది రైతులు పంటలు సాగు చేస్తున్నారు. స్వర్ణ ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాలువలతో పాటు జౌలినాల ద్వారా పంటలకు నీటిని వదులుతారు. స్వర్ణ ద్వారా నీటిని వదలక పోవడంతో చివరి ఆయకట్టుకు రావడం లేదు. నిర్మల్ మండలం తల్వేద శివారులో జౌలినాల ద్వారా వచ్చిన నీరు గుంతల్లో నిలువగా మోటర్ ద్వారా రైతు సుంచు రాజు, ఆయన స్నేహితుడు పంటలకు పారించుకుంటున్నారు. –
ఆకేరు సాక్షిగా అవస్థలెన్నో,,
నర్సింహులుపేట, మార్చి 12 ; ఐదేళ్లుగా ఎప్పుడూ లేని విధంగా మహబూబాబాద్ జిల్లాలో ఆకేరువాగు ఎండిపోవడంతో సాగు చేసిన వరి పొలాలు కాపాడుకునేందుకు అన్నదాత అరిగోస పడుతున్నాడు. నర్సింహులపేట మండలంలోని జయపురం శివారులో ప్రవహించే ఈ వాగులో నీరు లేకపోవడంతో చేతికి వచ్చిన వరి పంటను కాపాడుకునేందుకు జేసీబీల సహాయంతో గుంతలు తీయిస్తూ నీటికోసం రైతన్న తిప్పలు పడుతున్నాడు. గంటపాటు నీరు వస్తే మరోగంట ఆగాల్సి వస్తున్నదని, దీంతో తమకు తిప్పలు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం.. అన్నదాతకు శాపం
శక్కర్‌నగర్ ; నిజామాబాద్ జిల్లా బోధన్ శివారులోని బెల్లాల్ చెరువు నుంచి పట్టణానికి తాగు, పంటలకు సాగునీరు అందిస్తారు. సాగునీరు ప్రవహించే శర్బత్ కెనాల్ మున్సిపల్, నీటిసారుదల శాఖల అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెత్తతో నిండిపోయింది. దీంతో చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. అధికారులు పట్టించుకోక పోవడంతో రైతు బండారి చిన్న గంగాధర్ స్వయంగా రంగంలోకి దిగారు. కెనాల్లోకి దిగి చెత్తను తొలగించారు.
730 అడుగులు తవ్వినా చుక్కనీరు రాలే..
బోథ్, మార్చి 12 ; ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో 250 నుంచి 300 వరకు బోరుబావు లను ఈ రెండు నెలల్లో తవ్వించారు. ఒక్కో బోరుబావికి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చవుతున్నది. కన్గుట్టకు చెందిన మునిగెల రమేశ్ 730 అడుగుల లోతు వరకు బోరు తవ్వించినా చుక్క నీరు రాలేదు. దీంతో పంటలను పశువుల మేతగా వదిలేస్తున్నారు.