BRS | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి ఈనెల 26న కంధార్-లోహాలో బహిరంగ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గతనెల 5న నాందేడ్‌లో నిర్వహించిన సమావేశం అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని ప్రకటించింది. కేసీఆర్ నాందేడ్‌లో పర్యటించిన తరువాతే తమకు మేలు జరిగిందని అక్కడి రైతులు భావిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రమంతటా బీఆర్ఎస్ కిసాన్ సమితి.. మహారాష్ట్ర రైతుల్లో తెలంగాణ మాడల్‌కు విస్తృత అవగాహన కల్పిస్తున్నది. మహారాష్ట్రలో త్వరలో జరిగే పంచాయతీ సమితి ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావశక్తిగా అవతరించే అవకాశాలున్నాయని అక్కడ జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అక్కడి ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి సాయం వెనుక బీఆర్ఎస్ కిసాన్ విభాగం నిర్వహిస్తున్న కార్యక్రమాలేనని రైతులు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఈ నెల 26న కంధార్-లోహా బహిరంగ సభ కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. సభ ఏర్పాట్లను నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ, మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం పర్యవేక్షిస్తున్నారు.
రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్ తదితర పథకాలతో రూపొందించిన వీడియోలను మహారాష్ట్ర కిసాన్ సమితి పల్లెపల్లెన ప్రదర్శిస్తున్నది. మరాఠీ, హిందీ భాషల్లో రూపొందించిన ఈ వీడియోలకు విస్తృత ఆదరణ లభిస్తున్నది. బహిరంగసభ జరిగే కంధార్-లోహా సమీప ప్రాంతాలైన నాందేడ్, పూర్ణ, పాలెం, అర్దర్పూర్, అహ్మద్‌పూర్ పరిసర ప్రాంతాల్లో 20 ప్రచార రథాల ద్వారా తెలంగాణ మాడల్‌పై ప్రచారం చేస్తున్నారు.
గతనెల 5న నాందేడ్‌లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్వహించిన చేరికల సమావేశం, మీడియా సమావేశం అనంతరం మహారాష్ట్రలోని రాజకీయ పార్టీల నాయకుల్లో, వివి ధ రంగాలకు చెందిన మేధావి వర్గంలో బీఆర్ఎస్ పట్ల విశ్వాసం ఏర్పడింది. ఈ క్రమంలో మహారాష్ట్ర రైతు విభాగం ఏర్పాటుతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ కిసాన్ సమితులను పార్టీ నియమించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఇచ్చిన అబ్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం మహారాష్ట్ర రైతాంగాన్ని విశేషంగా ఆకర్షిస్తున్నది. వివిధ పార్టీల్లోని ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులే కాకుండా వివిధ వర్గాలకు చెందినవారు బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. 26న జరిగే బహిరంగ సభలో పలు పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.