KTR | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): నాటి జలదృశ్యం నుంచి నేటి సుజల దృశ్యం వరకు బీఆర్ఎస్ ప్రగతి ప్రస్థానం అనన్యసామాన్యంగా, అప్రతిహతంగా దూసుకుపోతున్నదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు చెప్పారు. ఇదంతా సమర్థవంతమైన సీఎం కేసీఆర్ నాయకత్వం, దార్శనికతతోనే సాధ్యమైందని అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో పార్టీ ప్రతినిధుల సభలో కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘నేను ఇటీవల ఒక పెద్ద మనిషిని కలిసినప్పుడు వారు మీ సీఎంలో ఉద్యమకారుడే కాదు మంచి పాలనాదక్షుడు ఉన్నారు. ఇట్లా రెండూ కలిసి ఉండడం అరుదని కొనియాడారు. మన ప్రభుత్వ విధానం విధానం దేశానికి ఆదర్శంగా నిలిచింది. డాటా లేకుండా చేసే పాలన కరెక్టు కాదనేది మన సీఎం నమ్మిన అంశం.
అందుకే రాష్ట్రం ఏర్పాటవగానే సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి గణాంకాలతో అభివృద్ధిని సుసంపన్నం చేశారు’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో 2.8 శాతం జనాభా కలిగిన తెలంగాణ అభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖలో 30 శాతం జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నట్టు వివరించారు. ధాన్యం దిగుబడి భారీగా పెరిగిందని, విద్య, వైద్య విద్య, గురుకులాల ఏర్పాటు వేరే ఏ రాష్ట్రంలో కూడా ఇంతగా లేవని వెల్లడించారు. దేశంలో ఒకే ఒక స్టార్టప్ స్టేట్ గా తెలంగాణ ఎదగడం గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. మౌలిక వసతుల కల్పన అనేది అభివృద్ధికి మూలమని, నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనెడీ చెప్పినట్టు పేర్కొన్నారు. దేశంలో సహజ వనరులను వాడుకొనే తెలివున్న ప్రభుత్వాలే లేవన్నారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్’ అని సీఎం కేసీఆర్ పిడికిలి బిగిస్తే దేశమంతా గొప్పగా స్పందిస్తున్నదని తెలిపారు. మహారాష్ట్రలో విజయవంతమవుతున్న సభలే నిదర్శనమన్నారు.
‘మన తల్లిదండ్రులు జీవిత చరమాంకంలో ఇల్లు కట్టుకొనేవారు. నేటి ఐటీతరం ఉద్యోగం రాగానే లోన్ తెచ్చుకొని ఇల్లు కడుతున్నారు. అప్పు తీర్చగలమనే భరోసాతోఅభివృద్ధి చెందుతున్నారు. కేంద్ర పాలకులు ముఖ్యంగా బీజేపీ వంటి ప్రభుత్వాలు ఈ విధానాన్ని అనుసరిస్తే దేశం ఎప్పుడో ఐదు ట్రిలియన్ మారును దాటేది. ప్రపంచంలో అత్యంత అప్పులున్న దేశాలు, అదే సందర్భంలో నూ అత్యంత ధనవంతమైన దేశాలు అమెరికా, జపాన్‌లే’ అనే విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టు నూతన ఆర్థిక విధానం తక్షణావసరమని తెలిపారు. ‘విజన్ ఫర్ నయా భారత్’ పేరిట మన అధినేత దార్శనికతతో ముందుకుపోవాలని సూచించారు.
ఇప్పడు దేశానికి కావాల్సింది ‘డబుల్ ఇంజిన్ సరార్ కాదు.. డబుల్ ఇంపాక్ట్ సరార్’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో శ్వేత, నీలి, పింక్, ఎల్లో వంటి ఐదు విప్లవాలతో అప్రతిహత ప్రగతిని సాధిస్తున్నట్టు వెల్లడించారు. రూ.4.5 లక్షల కోట్లను వ్యవసాయం, అనుబంధ రంగాలకే ఖర్చు చేయడం దేశంలోనే ఎన్నడూ జరగలేదని చెప్పారు. పాలకు సైతం జీఎస్టీ వసూలు చేస్తున్న కేంద్ర.. అదానీకి చ్చిన పోర్టులకు ఎందుకు జీఎస్టీ వసూలు చేయట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. యువత రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.