కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్‌తో సర్వే చేయించి, రాష్ట్ర ప్రభుత్వ ఇంజినీర్లతో డిజైన్లు గీయించి, ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఎల్అండ్టీ లాంటి సంస్థలతో పనులు చేయించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు కేసీఆర్. గోదావరిని ఎగువకు మళ్లించి పంట పొలాలకు పారించారు. తెలంగాణలో ఒక బృహత్ జలవలయాన్ని సృజించి.. ఊరూరా చెరువులను అనుసంధానించిన సాగునీటి అద్భుతమది. మూడు బరాజ్‌లు.. 16 రిజర్వాయర్లు.. 21 పంప్‌హౌస్‌లు.. 203 కిలోమీటర్ల సొరంగమార్గం.. 1,531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు.. వీటన్నిటి సమగ్ర సమాహారమే కాళేశ్వరం. ఒక్క బరాజ్‌లోని 88 పిల్లర్లలో ఒకటి కుంగిపోతే.. మొత్తం ప్రాజెక్టే కుంగిందని బీఆర్ఎస్పై నిందలేశారు. చిన్న రిపేరుకు అవకాశమున్నా, నిర్మాణ సంస్థను అనుమతించక.. ప్రాజెక్టును, దాని కింద రైతాంగాన్నీ ఎండబెట్టారు.
ఎస్ఎల్బీసీ.. 2005లో కాంగ్రెస్ మొదలు పెట్టిన ప్రాజెక్టు. దశాబ్దాలుగా తొక్కి పెట్టిన ప్రాజెక్టు. పూర్తిచేసి నీళ్లిచ్చే ఉద్దేశం లేదు కాబట్టే.. తలాతోకా లేకుండా అడ్డదిడ్డంగా చేపట్టి అస్తవ్యస్తం చేసిన ప్రాజెక్టు. కేసీఆర్ చెప్పినట్టు.. ముందుకు పోలేని, వెనక్కి రాలేని విధంగా నడిమిట్లనే నలిగేలా చేశారు. చరిత్రలో ఒక్క ప్రాజెక్టునూ కాంగ్రెస్ సంపూర్ణంగా కటి ్టచూపిందీ లేదు. సమస్యేదీ రాకుండా పూర్తిచేసి నీళ్లిచ్చిందీ లేదు. కాలయాపనకు మారుపేరు కాంగ్రెస్. సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగకుండా దశాబ్దాలపాటు సాగదీశారు. చాలావరకు మొదలే పెట్టలేదు. చేపట్టిన వాటినీ చెడగొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, కక్కుర్తి, చేతకానితనంతో కుప్పకూలిన ప్రాజెక్టులెన్నో! వట్టెం.. సుంకిశాల.. ఇప్పుడు ఎస్ఎల్బీసీ! గడిచిన 14 నెలల్లో నిర్వహణా వైఫల్యానికి సాక్షీభూతంగా నిర్మాణంలోనే కూలిన ప్రాజెక్టులు! కాంగ్రెస్ తప్పుల భారంతో కుప్పకూలిన గుయ్యారాలు!
Congress | హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): పొరుగు రాష్ర్టాలతో చిక్కులు. అనుమతులు రానేరావు. నిధులు ఉండవు. సంవత్సరాలు గడిస్తే తప్ప సర్వేలు పూర్తికావు. భూసేకరణ ముందుకు పోదు. ఆనకట్టలు కట్టరు. అనామతుగా సర్కారు భూమి ఉన్న చోట మట్టి తవ్వడం, కాలువ తీయడం.. ఇదీ ఉమ్మడి రాష్ట్రంలో, కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టు పనులు కొనసాగిన తీరు. మేజర్, మీడియం, మైనర్ ఇలా ఏ ప్రాజెక్టయినా సరే మూలకునెట్టుడు ఆ పార్టీ ప్రభుత్వాల రివాజు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలోనైనా కాంగ్రెస్ పార్టీ పాలనతీరు మారిందా అంటే అదీ లేదు. వరుస వైఫల్యాలు..ప్రాజెక్టులు కూలుడు.. లేదంటే మునుగుడు. కాంగ్రెస్ పాలనలో ఆర్భాటపు ప్రచారం తప్ప వీసమెత్తు పురోగతి లేకుండా పోయింది. కానీ స్వరాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణీత సమయంలోనే పనులు పూర్తిచేయడంతో అతి భారీ ప్రాజెక్టులు, నిర్మాణాలు ఆవిష్కృతమయ్యాయి. వందల కిలోమీటర్ల పొడవైన సొరంగాలను, కాలువలను, అతిపెద్ద సర్జిపూల్స్, పంప్‌హౌజ్‌లను నిర్మించి చూపించింది. ప్రణాళికతో ముందుకెళ్తూ ప్రాజెక్టులను పరుగులు పెట్టించింది. జలఫలాలను తెలంగాణకు పంచింది.
ప్రాజెక్టులను పడావుపెట్టిన కాంగ్రెస్
ప్రాజెక్టులను చేపట్టకుండా ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండనే కాదు యావత్ తెలంగాణ రైతుల ఉసురు తీసిందే కాంగ్రెస్ పార్టీ. హస్తం పార్టీ 60ఏండ్ల అలక్ష్యం వల్ల పాలమూరు వలసల జిల్లాగా మారిపోయింది. కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం సర్వే కోసం 1984లో జీవో జారీ చేశారు. ఆ తరువాత ఐదేండ్లకు ఆ ప్రాజెక్టుల సర్వే కోసం ఒక సరిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 1997లో సర్వే కోసం రూ.50 లక్షల నిధులు మంజూరు చేశారు. 1999లో పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. 2003లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి 2003లోనే పనులు ప్రారంభించారు. మొత్తంగా ప్రాజెక్టు సర్వేకు 1984లో జీవో జారీ చేస్తే 20 ఏండ్ల తర్వాత ఎన్నికల ముందు, కేసీఆర్ తెలంగాణ జెండా ఎత్తిన అనంతరం పనులు ప్రారంభించారు. అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే దాకా అంటే పదేండ్లయినా పనులు పూర్తి చేయలేదు. నిధుల కొరత, భూసేకరణ, అటవీ అనుమతులు, రైల్వే, రోడ్డు క్రాసింగ్, అంతర్రాష్ట్ర వివాదాలు, కాంట్రాక్టు సంస్థలతో వివాదాలు, కోర్టు కేసులు తదితర సాకులు చూపెడుతూ ప్రాజెక్టులను మూలకునెట్టారు. ఇదీ ఉమ్మడిపాలనలో తెలంగాణ ప్రాజెక్టుల దుస్థితి. అదీగాక ఎత్తిపోతల పథకాల్లో సంక్లిష్టమైన పంప్‌హౌజ్, సర్జ్పూల్ల నిర్మాణం, పంపులు, మోటార్ల బిగింపు, విద్యుత్తు సరఫరాకు సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్ల నిర్మాణం, డిస్ట్ట్రిబ్యూటరీ కాలువల తవ్వకానికి అవసరమైన భూసేకరణ పూర్తిగా చేపట్టలేదు. ఇవే కాదు కోయిల్‌సాగర్, రాజీవ్‌భీమా, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, ఎస్సారెస్పీ స్టేజ్2, వరద కాలువ, దేవాదుల ఎత్తిపోతలు.. ఇలా చెప్పుకుంటే కాంగ్రెస్ దశాబ్దాల పాటు మూలకునెట్టిన ప్రాజెక్టులు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజానీకానికి అనుభవంలోనివే.. కండ్లముందు ఉన్నవే.
14 నెలల కాలంలో కూలుడే..
ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులను మూలకునెట్టి తెలంగాణ రైతాంగం ఉసురు తీసిన కాంగ్రెస్ స్వరాష్ట్రంలోనైనా తప్పులు దిద్దుకున్నదా? అంటే అదీ లేదు. అదే నిర్లక్ష్యం.. అవగాహన రాహిత్యంతోనే ముందుకు సాగుతున్నది. ప్రచారంపై తప్ప నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించని దుస్థితి నెలకొన్నది. ప్రభుత్వ వైఫల్యానికి, పట్టింపులేనితనానికి రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలే నిదర్శనం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడింది. వరదల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యమే అందుకు ప్రధాన కారణం. వరద ఉధృతంగా వస్తున్నా సకాలంలో స్పందించి ప్రాజెక్టు గేట్లు తెరవకుండా నిర్లక్ష్యం వహించడంతో ప్రాజెక్టుకు గండి పడిందని అధికారులే నిర్ధారించారు. ఫలితంగా ఇరిగేషన్శాఖకే దాదాపు రూ.30కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. దాదాపు 200 ఎకరాల మేర ఇసుక మేటలు ఏర్పడడంతోపాటు, 16గ్రామాలు ముంపునకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. 90 ట్రాన్స్ఫార్మర్లు, 200 కరెంటు స్థంభాలు ధ్వంసమైనట్టు ప్రాథమికంగా తేల్చారు. ఇప్పటికీ ప్రాజెక్టుకు సంబంధించి మరమ్మతుల పనులపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ఆ దిశగా ఒక్క అడుగు వేసిన దాఖలా లేదు.
కేసీఆర్ హయాంలో నిర్ణీత గడువులో పూర్తి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ సారథ్యంలో ప్రాజెక్టులన్నీ నిర్ణీత గడువులో పూర్తయ్యాయి. దశాబ్దాలుగా పెండింగ్ ప్రాజెక్టులుగా పేరుమోసిన ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మారాయి. ఇంజినీరింగ్ నిపుణులతో కూలంకషంగా సమీక్షించి సమస్యలను పరిషరించారు. క్షేత్రస్థాయిలో తిరుగుతూ పనులను నిరంతర పర్యవేక్షణతో, ప్రాధాన్య క్రమంలో నిధులను సమకూర్చుతూ, అవసరమైన అనుమతులను సత్వరమే జారీ చేస్తూ పెండింగ్ ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించారు. కేవలం రెండేళ్లలోనే ఉమ్మడి మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టు పనులను 50శాతం నుంచి 95 శాతానికి పూర్తిచేశారు. వెరసి 2016-17లో కల్వకుర్తి ద్వారా 3.07 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు ద్వారా 1.2 లక్షల ఎకరాలు, భీమా ద్వారా 1.58 లక్షల ఎకరాలు, కోయిల్‌సాగర్ ద్వారా 8 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు.. మొత్తం నాలుగు ఎత్తిపోతల పథకాల ద్వారా 5 లక్షల ఎకరాలకు తొలిసారిగా సాగునీటిని అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దే. క్రమంగా డిస్ట్రిబ్యూటరీల పనులను పూర్తి చేయడంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల కింద నికరంగా 12లక్షలకు పైగా ఎకరాలకు సాగునీటిని అందించడం జరుగుతున్నది. ఆర్డీఎస్ ఆయకట్టు కోసం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి కేవలం 11నెలల వ్యవధిలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిచేసింది. అంతేకాదు బృహత్తర పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడమేకాదు ప్రధాన పనులన్నీ బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయి. ఇక గోదావరి బేసిన్లోనూ మిడ్‌మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చారు. వరద కాలువను సజీవజలధారగా మార్చారు. ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు ప్రాజెక్టును 10నెలల కాలంలోనే పూర్తి చేశారు. ఇవీగాక దశాబ్దాలుగా పెండింగ్ ప్రాజెక్టులుగా ముద్ర వేసుకున్న అనేక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది.
ఇప్పుడు ఎస్ఎల్బీసీ వంతు
43.93 కిలోమీటర్ల ఎస్ఎల్బీసీ సొరంగం పనులను 2 వైపుల నుంచి ప్రారంభించారు. శ్రీశైలం ముఖద్వారం నుంచి (ఇన్లెట్) అంటే దోమలపెంట నుంచి, మరోవైపు నల్లగొండ జిల్లా మన్యవారిపల్లె నుంచి టన్నెల్ తవ్వకాన్ని ప్రారంభించారు. ఇన్‌లెట్‌లో 14 కిలోమీటర్ల వద్ద 8 మీటర్ల షియర్ జోన్ (వదులైన భూమి) ఉండి భారీ సీపేజీ వస్తున్నది. ప్రమాదకరమైన ఈ జోన్‌ను గతంలోనే గుర్తించారు. పూర్తిస్థాయిలో అధ్యయనం చేయించి, నిపుణుల సూచనల మేరకు నివారణ చర్యలు చేపట్టి, సొరంగం పనులను నిర్వహించాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అవేవీ చేయకుండా హడావుడిగా పనులను నిర్వహించింది. సీపేజీని నివారించకుండా, నిపుణుల సలహాలు సూచనలు లేకుండానే ప్రచారం కోసం పనులను పునఃప్రారంభించింది. వెరసి భారీ సీపేజీ రావడంతోపాటు, అంచనాలు తప్పి సొరంగం కుప్పకూలిపోయింది. ఫలితంగా 8 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. క్షేత్రస్థాయి పరిస్థితులన్నీ వివరించినా కాంగ్రెస్ సర్కారు పెడచెవిన పెట్టడం వల్లే, పనులు చేయాల్సిందేనంటూ మెడమీద కత్తిపెట్టినంతగా ఒత్తిడి చేయడం ఫలితంగానే ప్రమాదానికి కారణమని ఇంజినీరింగ్ నిపుణులు, కార్మికులు వెల్లడిస్తున్నారు.
కూలిన సుంకిశాల..
నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా కోసం సుంకిశాల ప్రాజెక్టును చేపట్టారు. ఈ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. ఎన్ఎస్పీ రిజర్వాయర్ సొరంగం పనులను చేపట్టారు.ఇన్లెట్ అంటే రిజర్వాయర్ వైపు నుంచి కొద్దిమేర తవ్వకుండానే వదిలిపెట్టి, మిగతా మొత్తం అంటే పంప్‌హౌజ్ వరకు సొరంగం తవ్వారు. పంప్‌హౌజ్ సొరంగ ద్వారం వద్ద గేట్‌ను అమర్చారు. కానీ పంప్‌హౌజ్ రిటైయినింగ్ పనులను పూర్తి చేయలేదు. స్లాబ్ వేసి రిటైయినింగ్ వాల్‌కు టైబీమ్స్ను పెట్టాల్సి ఉంది. కానీ ఆ పనులను చేయకుండానే, ప్రాజెక్టులోకి వస్తున్న వరదను అంచనా వేయకుండానే ఇన్లెట్ వైపు సొరంగ ద్వారాన్ని కప్పి ఉంచి మట్టిని తొలగించారు. ఫలితంగా ఒక్కసారిగా నీరు సొరంగంలోకి చొచ్చుకువచ్చింది. ఫలితంగా అవుట్లెట్ గేట్ కొట్టుకుపోవడంతోపాటు, రిటైయినింగ్ వాల్ మొత్తం కూలిపోయింది. వందల కోట్ల నష్టం వాటిల్లింది. ఏజెన్సీనే విషయాన్ని అంగీకరించింది. ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగానే ఈ ఘటన చోటుచేసుకుంది. అయినా ఇప్పటికీ కంపెనీపై చర్యలు తీసుకోలేదు.
మునిగిన వట్టెం పంప్‌హౌజ్..
ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దం పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పడావు పెట్టింది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ హయాంలోనే ప్రాజెక్టు పట్టాలెక్కింది. ప్రధాన పనులన్నీ పూర్తయ్యాయి. కేవలం డిస్ట్రిబ్యూటరీ కాలువను తవ్వాల్సి ఉంది. అందుకు సంబంధించిన పనులకు కూడా బీఆర్ఎస్ హయాంలోనే టెండర్లు పిలిచారు. కానీ మళ్లీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వెంటనే టెండర్లను రద్దు చేసింది. ఇప్పటికీ ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదు. కనీసం పర్యవేక్షణ కూడా చేపట్టని దుస్థితి నెలకొన్నది. ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా నిరుడు పాలమూరు రంగారెడ్డి పథకంలో భాగమైన వట్టెం పంప్‌హౌజ్ మునిగిపోయింది. వరదలతో నాగర్‌కర్నూల్ జిల్లా శ్రీపురం శివారులోని నాగనూలు చెరువు ఉప్పొంగింది. చెరువు బ్యాక్ వాటర్ ఒక్కసారిగా పెరగడంతో సమీపంలో ఉన్న వట్టెం రిజర్వాయర్‌కు నీటిని తరలించే కట్టకు గండిపడి టన్నెల్లోకి నీరు భారీగా చేరింది. అదేవిధంగా కుమ్మెర గ్రామ సమీపంలోని చెరువు వరద కూడా టన్నెల్లోకి పారింది. దీంతో చూస్తుండగానే పంప్‌హౌస్ నీటిమునిగింది. 16కిలోమీటర్ల పొడవు, 9మీటర్ల డయాతో ఉన్న 2సొరంగాలు పూర్తిగా నీటితో నిండిపోయాయి. ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. పంప్‌హౌజ్‌లోకి చేరిన నీటిని తోడేందుకు దాదాపు నెలల సమయం పట్టింది. ఇందుకోసం ఎంతో ఖర్చయ్యింది.
మూడున్నరేండ్లలో కాళేశ్వరం
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ అధ్యయనాలు.. కార్యదక్షత.. దూరదృష్టి.. మొక్కవోని ఆశయం.. దశబ్దాల ఆర్తి.. వెరసి ఆవిష్కృతమైనదే కాళేశ్వరం ప్రాజెక్టు. మేడిగడ్డ వద్ద సుమారు 100 అడుగల ఎత్తు నుంచి ఏకంగా 618 అడుగుల ఎత్తుపైకి జలాలను తరలించి బీళ్లకు మళ్లించడమే లక్ష్యంగా 2016 మే 2వ తేదీన ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అనంతరం మూడున్నరేండ్ల స్వల్ప కాలంలోనే పూర్తి చేసి 2019 జూన్ 21న కేసీఆర్ ప్రారంభించారు.ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణం మొదలు నిర్వహణ వరకూ ప్రతి ఘట్టమూ ఒక అద్భుతమే. వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం.. నిర్మించిన తీరు అపూర్వం. ప్రాజెక్టులో కాంక్రీట్ వినియోగంలో, జలాల తరలింపునకు వినియోగించే బాహుబలి మోటర్లు, తవ్విన సొరంగమార్గాలు, కాలువలు, రిజర్వాయర్లు, సర్జిపూల్స్ వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నవి. అంతే సంక్లిష్టతతో కూడుకున్నవి. ఇక కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దేశంతోపాటు, రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద లిఫ్ట్ స్కీమ్. కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోనూ కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాలు ఉన్నాయి. వందల కిలోమీటర్ల కాలువలు, సర్జ్‌పూల్స్, రిజర్వాయర్లు, అన్నింటికీ మించి అతి భారీ సామర్థ్యం కలిగిన పంపులు కూడా ఉండడం గమనార్హం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులో భాగంగా ఏదుల వద్ద భూగర్భంలో నిర్మిస్తున్న సర్జ్‌పూల్ (కెవిన్) వెడల్పు 31 మీటర్లు, పొడవు 360 మీటర్లు. ఇది ఆసియాలోనే అతిపెద్ద కెవిన్. అంతేకాదు ఒకో మిషన్ సామర్థ్యమే కాదు, మూడు పంప్ హౌజ్‌లలో వరుసగా 145మెగావాట్ల సామర్థ్యమున్న పంపులను 9 చొప్పున అంటే అధికసంఖ్యలో భారీ సామర్థ్యం కలిగిన పంపులను ఏర్పా టు చేయటం కూడా ఇదే తొలిసారి. ఇంతకు ముందు ఎకడా ఇలా నిర్మించకపోవడం గమనార్హం. కాళేశ్వరంలోని గాయత్రీ పంపింగ్ కేంద్రంలో పంపింగ్ ఎత్తు 118 మీటర్లు. ఇదే గరిష్ఠం. కానీ పాలమూరు రంగారెడ్డిలో దానికన్నా ఎకువ ఎత్తులో పోస్తున్నారు. ఏదుల పంపింగ్ కేంద్రంలో నీరు పంపింగ్ చేసే ఎత్తు 124 మీటర్లు కాగా, ఇదే ఇప్పటివరకు గరిష్ఠం.
కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ హడావుడిగా మూడున్నరేండ్లలోనే పూర్తిచేయడం వల్లే మేడిగడ్డలో ఓ పిల్లర్ కుంగిందని కొందరు అజ్ఞానంతో వాదిస్తున్నరు. మరి, 2005లో మొదలుపెట్టిన ఎస్ఎల్బీసీ 20 ఏండ్లయినా సుదీర్ఘంగా ఎందుకు సాగుతున్నది? రెండు దశాబ్దాలపాటు నింపాదిగా నిర్మాణం చేస్తున్నా.. టన్నెల్ ఎందుకు కుప్పకూలింది?
ఊట నేల అని తెలిసీ.. సొరంగం ఎందుకు?
నదీగర్భంలో ఇసుకనే ఉంటదని, ఆనకట్టలు ఆ ఇసుక మీదే కట్టాల్సి ఉంటదని తెలవని కొందరు నడమంత్రపు మేధావులు, కాంగ్రెస్ నేతలు ఇసుకపై బరాజ్ ఎందుకు కట్టారని మిడిమిడి జ్ఞానంతో కాళేశ్వరంపై వితండవాదాలు చేశారు. ఆ అజ్ఞానాన్నే ప్రాతిపదికగా తీసుకుని వాదిస్తే.. మరి, అపార జలరాశులున్న అటవీ భూమి కింద.. ఉబికే నీటి ఊటలున్న నేలలో ఏ నమ్మికతో 44 కిలోమీటర్ల సొరంగం ప్లాన్ చేశారు? షియర్ జోన్ అని తెలిసీ.. ప్రాజెక్టు పనుల్ని, ప్రాణాల్ని ఎందుకు పణంగా పెట్టారు?
తొమ్మిదేండ్లు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయలే?
బీఆర్ఎస్ తన పదేండ్ల పాలనలో ఎస్ఎల్బీసీ కింద 12 కి.మీ సొరంగాన్ని తవ్విందనే వాస్తవాన్ని పక్కనబెట్టి, నాడు పనులు జరగకపోవడం వల్లే నేడు ప్రమాదం జరిగిందని ముఖ్యమంత్రి మొదలుకొని ఎమ్మెల్యేల దాకా పస లేని వాదన చేస్తున్నరు. ఈ వాదనే హేతుబద్ధమనుకుంటే, ఎస్ఎల్బీసీ మొదలైంది 2005లో. మరి ఇప్పుడు 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని బీరాలు పలికినవాళ్లు, అప్పుడే 2005 నుంచి 2014 వరకు తొమ్మిదేండ్లలోనే సొరంగాన్ని తవ్వేసి ఉంటే.. ఇప్పటికే పొలాలకు నీళ్లు పారేవి కదా? ప్రస్తుత ప్రమాదం జరిగి ఉండేదేకాదు కదా?
24