భధ్రాచలం, ఏప్రిల్ 13: భద్రాచలంతోనే తమ పేగుబంధం ముడిపడి ఉందని ఐదు విలీన పంచాయతీల ప్రజలు నినదిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రాలో నరకయాతన పడుతున్నారని, భద్రాద్రి రాముడి పాదాల చెంతకు ఎప్పుడు చేరుదామా అని ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విలీనం చేసిన భద్రాచలంలోని ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలుపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, టీజీవోస్, టీఎన్జీవోస్ యూనియన్ల ఆధ్వర్యంలో భద్రాచలంలో సోమవారం నిర్వహించిన భద్రాద్రి పునరేకీకరణ విస్తృతస్థాయి అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో విలీనం చేసిన కన్నాయిగూడెం, ఎటపాక, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం పంచాయతీలను తిరిగి భద్రాచలానికి ఇస్తేనే భద్రగిరికి ఒక రూపు వస్తుందని పేర్కొన్నారు.
ప్రజల సహకారం అవసరం: జేఏసీ
రా్రష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ ఐదు పంచాయతీలు భద్రాద్రి పునరుజ్జీవానికి, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినవని పేర్కొన్నారు. తాము చేపట్టిన ఈ ఉద్యమానికి తెలంగాణ ప్రజల సహకారం, భాగస్వామ్యం అవసరమని చెప్పారు. ఎంపీ రేణుకాచౌదరి మాట్లాడుతూ.. ఆ ఐదు పంచాయతీలను భద్రాచలంలో విలీనం చేసేవరకు పోరాడుతామని స్పష్టంచేశారు. కార్యమక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, జేఏసీ నేతలు గుంటుపల్లి శ్రీనివాసరావు, అమరనేని రామారావు, డెక్క నరసింహారావు, బాలకృష్ణ, చైతన్యభార్గవ్, చల్లగుళ్ల నాగేశ్వరరావు, కామేశ్వర్రావు, బీఆర్ఎస్ నాయకులు మానె రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్, ఆకోజు సునీల్, కావూరి సీతామహాలక్ష్మి, నక్క వెంకన్న, సంపత్, అజ్జినాయక్, శివ, ఆవులూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.