హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తేతెలంగాణ): ‘మావోయిస్టులు చేసేది హింస అయితే, వారిని చంపేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ప్రతి హింసే కదా! తుపాకీకి తుపాకీ పరిషారం కాదు. మనుషులను చంపే అధికారం చట్టం ఎవ్వరికీ ఇవ్వలేదు’ అని పలువురు వక్తలు స్పష్టంచేశారు. ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వపు బూటకపు ఎన్కౌంటర్ల ద్వారా మావోయిస్టులను చంపడాన్ని నిరసిస్తూ సీపీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ మఖ్ధూంభవన్‌లో గురువారం ‘రౌంట్‌టేబుల్’ సమావేశం జరిగింది. బూటకపు ఎన్కౌంటర్లతో మావోయిస్టు నాయకులను హత్యలు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం హైదరాబాద్ ట్యాంక్‌బండ్ అంబేదర్ విగ్రహం వద్ద ‘అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా’ నిర్వహించాలని రౌండ్‌టేబుల్ సమావేశం నిర్ణయించింది.
కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా సంతకాల సేకరణ చేపట్టాలని కోరుతూ తీర్మానించారు. పాకిస్థాన్ ఉగ్రవాదులకు అవకాశం కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. దేశ పౌరులైన, పేదల కోసం పని చేస్తున్న మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపడం లేదని వక్తలు నిలదీశారు. బూటకపు ఎన్కౌంటర్లపై పౌరసమాజం స్పందిచకపోతే భవిష్యత్తు మరింత ప్రమాదకర పరిస్థితులను ఎదురొవాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. అభివృద్ధి నమూనా పేరుతో మావోయిస్టులను ఎన్కౌంటర్ల పేరుతో కేంద్రం హత్య చేస్తున్నదని ఆరోపించారు. 2026 మార్చి నాటికి అటవీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు ఇస్తామని కేంద్రం మాటిచ్చిందని, అందు కే ఆ గడువులోపు మావోయిస్టులను హ త్యచేసే పనిలో పడిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టులను హతమార్చిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని, బూటకపు ఎన్కౌంటర్లపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. అదే సమయంలో మావోయిస్టులు కూడా సాయుధ పోరాటాన్ని వదిలి ప్రజా జీవితంలోకి రావాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పౌరహక్కులు, ప్రజాసంఘాలు, పార్టీల నాయకులు, ప్రతినిధులైన ప్రొఫెసర్ హరగోపాల్, జస్టిస్ చంద్రకుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, అరుణోదయ విమలక తదితరులు పాల్గొన్నారు.