అయిజ, జూన్ 6 : జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను రైతులు అడ్డుకున్న ఘటన తెలిసిందే.. ఈ ఘటనలో దాడికి పాల్పడ్డారన్న నెపంతో పోలీసులు 40 మందిపై కేసులు నమోదు చేసి.. 12 మందిని రిమాండ్‌కు తరలించారు. అరెస్టయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు జిల్లా అఖిలపక్షం నాయకులు శుక్రవారం పెద్ద ధన్వాడకు అయిజ మీదుగా వెళ్తుండగా.. అయిజ ఎస్సై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు కర్నూల్ రోడ్డులోని చిన్నతాండ్రపాడు రహదారిపై వాహనాలను అడ్డగించి.. నాయకులను అరెస్టు చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నేత నాగర్‌దొడ్డి వెంకట్రాములు, సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు ఆంజనేయులు, వెంకటస్వామి, బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య, రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల్‌యాదవ్, బహుజన రాజ్య సమితి నాయకులు వాల్మీకి, వినోద్, నర్సింహతోపాటు పలువురిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును నిలిపివేయాలని శాంతియుతంగా పోరాటం చేస్తున్న రైతులను జైలుకు పంపడం సరికాదని చెప్పారు.