హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఉద్యానవన శాఖ డైరెక్టర్ వెల్లడించారు. రాష్ట్రంలో సమీకృత ఉద్యాన పథకం విస్తరణలో భాగంగా 2025-26 సంవత్సరానికి 61,529 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు విస్తరణ, 26,095 నీటి కుంటలు ఏర్పాటు కోసం రూ.145.83 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. శనివారం ‘ఉద్యానవన శాఖ అధ్వానం’ శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో ప్రచురితమైన కథనంపై ఉద్యానవన శాఖ అధికారులు స్పందించారు. రెండున్నరేండ్లుగా పాలీహౌస్‌ల నిర్వహణ మరచారని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వచ్చిన కథనంపై అధికారులు అలర్ట్ అయ్యారు. ఉద్యానవన శాఖ డైరెక్టర్ పేరుతో తమ శాఖ పరిధిలో రెండున్నరేండ్లలో చేపట్టిన కార్యక్రమ వివరాలను అధికారులు విడుదల చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు విడుదలయ్యాయని పేర్కొన్నారు.
ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో విస్తరణ, నర్సరీల నిర్వహణ తదితర కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. 2023-24 నుంచి 2025-26 వరకు 1.63 కోట్ల హైబ్రిడ్ టమోటా, వంకాయ, మిర్చి, క్యాప్సికం కూరగాయల నారు అందజేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని దాదాపు 2,187.63 ఎకరాల్లో రైతులకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఎంఐడీహెచ్ పథకం కింద జీడిమెట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు రూ.2 కోట్ల హైబ్రిడ్ కూరగాయల మొక్కల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. జీడీమెట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఇండ్రో-ఇజ్రాయెల్‌కు చెందిన నిపుణులతో శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పాలీహౌస్‌ల నిర్మాణాల్లో షెడ్‌నెట్ ఏర్పాటు, డ్రిప్, ఫాగర్ వ్యవస్థ అమరిక తదితర పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నట్లు వివరించారు. రెడ్‌హిల్స్‌లోని పబ్లిక్ గార్డెన్ నర్సరీలో ఉన్న పాలీహౌస్లో మొక్కల ఉత్పత్తి కార్యకలాపాలు చేపట్టేందుకు హెచ్ఎండీఏను కోరినట్లు తెలిపారు. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డైరెక్టర్ వెల్లడించారు.