హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పల్లెసీమల్లో అభివృద్ధి పను లు పడకేశాయి. బీఆర్ఎస్ పాలనలో పల్లె ప్రగ తి కార్యక్రమంతో అభివృద్ధి పథాన పరుగులు పెట్టిన గ్రామాలు ఇప్పుడు నిధుల్లేక నిర్వీర్యమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కావడంతో ఆ ప్రభావం గ్రామాల అభివృద్ధికి వెన్నెముకగా నిలిచే 15వ ఆర్థిక సంఘం నిధులపై పడింది. ఎన్నికలు సకాలంలో జరగకపోతే కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక సంఘం నిధుల్లో కోత పడుతుంది.
ఇప్పుడు తెలంగాణలో జరిగింది అదే. స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేక గత రెండేండ్లలో 15వ ఆర్థిక సం ఘం నుంచి పంచాయతీలకు దకాల్సిన దాదా పు రూ.3 వేల కోట్లు విడుదల కాలేదు. గ తం లో బీఆర్ఎస్ పాలనలో పంచాయతీ ఎన్నికలు సకాలంలో జరిగాయి. దీనివల్ల ఏటా పంచాయతీలకు సుమారు రూ.1,430 కోట్ల కేంద్ర నిధులు ఠంఛన్‌గా విడుదలయ్యాయి. ఆ నిధులతో గ్రామాలు తమ ప్రాథమిక అవసరాలను తీర్చుకోగలిగాయి. ఇప్పుడు గ్రామ పంచాయ తీ పాలకవర్గాలు లేవన్న కారణంతో 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలను నిలిపివేసింది. ఈ భారీ మొత్తాన్ని కోల్పోవడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై, మౌలిక వసతుల కల్పనపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నది. నిధుల్లేక గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ వంటి కనీస సేవలకు కూడా ఆటంకం ఏర్పడుతున్నది.
సర్పంచ్‌లు లేరన్న సాకుతో..
తెలంగాణలోని పంచాయతీల పాలకమండళ్ల పదవీకాలం నిరుడు ఫిబ్రవరి 1న ముగిసింది. అప్పటి నుంచి గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. 15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల ప్రకారం.. నిధుల విడుదలకు పాలకమండళ్లు అవసరం. ఈ నిబంధన కారణంగా 2024-25లో కేంద్రం కేటాయించిన రూ.1,514 కోట్లు నిలిచిపోయాయి. సకాలంలో ఎన్నికలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,109 కోట్లు, కర్ణాటకకు రూ.1,120 కోట్లు విడుదలయ్యాయి. తెలంగాణ మాత్రం ఆ అవకాశాన్ని కోల్పోయింది. సర్పంచులు లేరన్న కారణంగా గత ఏడాదిగా మన గ్రామాలకు ఒక రూపాయి కూడా విడుదల కాలేదు.
కేసీఆర్ కాలంలో రూ.6,051 కోట్లు
రాష్ర్టాలకు నిధుల విడుదల చేసే విషయం లో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. 2020-21 నుంచి 2023-24 వరకు తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు రూ.6,051 కోట్లు విడుదలయ్యాయి. కానీ, 2024-25లో ఒక రూపాయి కూడా రాలే దు. 2023-24లో కేటాయించిన రూ. 1,430 కోట్లలో రూ.1,424 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి, 2024 ఫిబ్రవరి నుంచి మ న పంచాయతీలకు పాలకమండళ్లు లేవన్న కా రణంతో మిగిలిన రూ.6 కోట్లు కోత పెట్టారు. 15వ ఆర్థిక సంఘం గడువు 2026 మార్చితో ముగియనున్నది. 2024-25లో ఎన్నికలు నిర్వహించకపోవడంతో రూ.1,514 కోట్లు పూర్తిగా నిలిచిపోయాయి. 2025-26లో రా వాల్సిన రూ.1,477 కోట్లు కూడా విడుదల కాలేదు. ఈ రెండేండ్లలో కలిపి మన పల్లెసీమలకు దాదాపు రూ.3వేల కోట్ల నష్టం వాటిల్లిం ది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే డిసెంబర్ చివరినాటికి మన గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఆ త ర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించి, 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని కోరితే 2025-26లో రావాల్సిన రూ.1,477 కోట్లు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. గట్టిగా ప్రయత్నిస్తే 2024-25 నాటి నిధులు కూడా వచ్చే పరిస్థితులు ఉ న్నా యి. లేకుంటే గ్రామీణ ప్రాంతాలు ఆర్థిక సం క్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉన్నది.
ఆదాయ మార్గాలు లేని పల్లెలు
రాష్ట్రంలోని దాదాపు అన్ని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులే ప్రధాన ఆదాయ వనరు. జనాభాకు అనుగుణంగా ఒక్కొక్కరికి రూ.812 చొప్పున 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేస్తుంది. పెద్ద గ్రామ పంచాయతీలకు ఇంటి పన్నులు, వ్యాపార పన్నులు, తైబజార్, భవన నిర్మాణ ఫీజులు, వ్యాపార, వాణిజ్య లైసెన్స్ఫీజుల ద్వారా కొంత నిధులు సమకూరుతాయి. కానీ, చిన్న గ్రామాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులు మినహా ఇతర ఆర్థిక ఆదాయ మార్గాలు పెద్దగా ఉండవు. దీంతో ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు చెత్త సేకరించే ట్రాక్టర్లలో డీజిల్ పోసేందుకు, బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు, తాగునీటి మోటర్ల రిపేరు, వీధి లైట్లు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర రోజువారీ కార్యకలాపాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించి కేంద్రం, 15వ ఆర్థిక సంఘం నిధులతో పల్లెల ప్రగతిని మళ్లీ గాడిలో పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
గతంలో తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు
ఆర్థిక సంవత్సరం మొత్తం (రూ.కోట్లలో)
2020-21 = 1,847
2021-22 = 1,365
2022-23 = 1,415
2023-24 = 1,424
(కేటాయింపు రూ.1,430 కోట్లు)
ఎన్నికలు జరగక నిలిచిపోయిన నిధులు
2024-25 = 1,514
2025-26 = 1,477