హైదరాబాద్ : రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) అన్నారు. ప్రముఖ దర్శకుడు,నిర్మాత, నటుడు దాసరి నారాయణరావు(Dasari Narayana Rao) 76 వ జయంతి సందర్భంగా చిత్రపురి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్(CM KCR) రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. సినీ పరిశ్రమలోని 24 విభాగాలకు చెందిన కార్మికులకు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానంటూ దాసరి నారాయణరావు ఒక ధైర్యాన్ని కల్పించారని తెలిపారు. 150 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్(Guinness Book)లో చోటు దక్కించుకున్నారని గుర్తు చేశారు. బంగారు నంది, నంది, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు అవార్డులను ఆయన అందుకున్నారని పేర్కొన్నారు.
దాసరి నారాయణరావు మరణంతో సినీ పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని అన్నారు. నటుడు ప్రభాకర్ రెడ్డి తో కలిసి దాసరి నారాయణరావు నాటి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చిన ఫలితంగానే చిత్రపురి కాలనీ(chitrapuri colony)లో వేలాదిమంది కార్మికులకు ఇండ్లు కేటాయించారని వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పరిశ్రమలోని అర్హులైన వారందరికీ అందిస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో నిర్మాత సీ కళ్యాణ్, డైరెక్టర్ నిమ్మల శంకర్, దాసరి అరుణ్ కుమార్, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు అనిల్, దొరై రాజు తదితరులు పాల్గొన్నారు.