27 Apr 2001
హైదరాబాద్ జలదృశ్యం. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో హైదరాబాద్
చరిత్రాత్మకంగా నిలిచిన రోజు.
22 Sep 2001
డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా. ఉద్యమాన్ని ఆశీర్వదించిన సిద్దిపేట ఉపఎన్నిక. టీఆర్ఎస్ ఉజ్వల ప్రస్థానంలో సిద్దిపేట చరిత్రాత్మకంగా నిలిచిన రోజు.
7 Dec 2006
కాంగ్రెస్ నేత ఎమ్మెస్సార్ సవాలుతో కరీంనగర్ ఉప ఎన్నికలో కేసీఆర్. రెండు లక్షలకు పైగా భారీ మెజార్టీ.
టీఆర్ఎస్ విజయయాత్రలో కరీంనగర్ చరిత్రాత్మకంగా నిలిచిన రోజు.
16 Dec 2010
చరిత్రలోనే అద్భుతమైన రీతిలో ఓరుగల్లులో 20 లక్షల మందితో తెలంగాణ మహాగర్జన సభ. టీఆర్ఎస్ జైత్రయాత్రలో వరంగల్ చరిత్రాత్మకంగా నిలిచిన రోజు.
హైదరాబాద్, సిద్దిపేట, వరంగల్, కరీంనగర్లాగే ఇప్పుడు మునుగోడు.. ఒక చరిత్రాత్మక సందర్భంలో నిలబడింది. టీఆర్ఎస్ జాతీయ రూపం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జైత్ర యాత్రలో తొలి దళంగా నిలిచే సువర్ణావకాశం మునుగోడు ప్రజలకు దక్కింది. మునుగోడులో టీఆర్ఎస్ విజయం ఎప్పుడో ఖరారైంది. అయితే, మునుగోడు ప్రజలిచ్చే అప్రతిహత విజయం.. అచంచల మెజారిటీ రేపు దేశంలో బీఆర్ఎస్ దండు యాత్రకు విజయ పథాన్ని పరువనుంది. మునుగోడు ఓటర్లిచ్చే భారీ మెజారిటీయే రేపటి బీఆర్ఎస్ విజయ సౌధానికి తొలి సోపానం. మరి ఈ చరిత్రాత్మక సన్నివేశానికి మునుగోడు ఓటరు సిద్ధమే కదా!
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఇప్పటికే ఖరారైపోయింది. గులాబీ అభ్యర్థికి 40 వేల మెజార్టీ వస్తుందని రాష్ట్ర, జాతీయ ఎన్నికల సర్వేలు ఇప్పటికే కుండబద్దలు కొట్టాయి. భారత రాష్ట్ర సమితి జైత్రయాత్ర అద్భుతంగా ప్రారంభం కావాలంటే ఈ మెజార్టీ భారీగా ఉండాలి. 60-70 వేలను మించిన మెజార్టీని టీఆర్ఎస్ అభ్యర్థికి నమోదు చేయాలి. ఇందుకోసం.. మునుగోడు ప్రజలంతా ఒక్కటై కదిలి రావాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణవాదులు పిలుపునిస్తున్నారు. దశాబ్దాల తరబడి ఫ్లోరోసిస్ బారినపడి నరకయాతన అనుభవించి.. స్వరాష్ట్రంలో.. స్వపరిపాలనలో శాశ్వతంగా విముక్తి పొందిన ప్రజలంతా ఈ చరిత్రాత్మక సందర్భంలో తామూ భాగస్వాములై.. బీఆర్ఎస్ ప్రస్థానంలో ముందుండి నడిపించాల్సిన సమయం వచ్చిందని వారు పేర్కొంటున్నారు. ఏండ్ల తరబడి గోసపడి.. రాష్ట్రంవచ్చిన తరువాత కృష్ణా నదీ జలాల పారకంతో వ్యవసాయాన్ని సంపన్నం చేసుకొన్న రైతులు.. దేశవ్యాప్తంగా కర్షకుల కష్టాలను తీర్చడం కోసం కదులుతున్న భూమిపుత్రుడు కేసీఆర్ వెన్నంటి నడవాల్సిన తరుణం ఇదేనని తేల్చి చెప్తున్నారు.
గొర్రెల పంపిణీ పథకంతో ఆర్థికంగా, సామాజికంగా బలోపేతమైన యాదవులు, కురుమలు.. ముఖ్యమంత్రి అడుగులో అడుగు కలపాల్సిన సన్నివేశమిదని.. శతాబ్దాల తరబడి.. సామాజిక, ఆర్థిక వివక్షతో పీడనకు గురైన దళితులకు దళితబంధుతో నిజమైన బంధువైన కేసీఆర్‌కు దళితులంతా దన్నుగా నిలబడాల్సిన సమయమిదని స్పష్టంచేస్తున్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ.. మార్కెటింగ్ సౌకర్యంతో మత్స్యకార వృత్తిని పరిపుష్టంచేసిన ముఖ్యమంత్రి వెంట ముదిరాజులంతా ఒక్కటై కదిలిరావాల్సిన సందర్భమిదేనని తెగేసి చెప్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కుదేలైపోయి.. దారాలే ఉరితాళ్లుగా మారిన చేనేతకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చిన కేసీఆర్‌కు దన్నుగా పద్మశాలీలు అందరూ ముక్తకంఠంతో నినదించాల్సిన సమయం ఇదని వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఒక వర్గం కాదు.. ఒక కులం కాదు.. ఒక మతం కాదు.. సంబ్బండ వర్ణాలన్నీ సంతుష్టమై.. ఉజ్వల తెలంగాణను సాకారం చేసిన నాయకుడు కేసీఆర్‌ను జాతీయ రాజకీయ యవనికమీద యోధునిగా నిలబెట్టే తరుణం ఇదేననేది యావత్ తెలంగాణ మాట!
వామపక్ష చైతన్యానికి నిలువుటద్దం
మునుగోడు ప్రాంతంలో కనిపించే మరో భిన్నత్వం.. ఇక్కడి వామపక్ష చైతన్యం. ఒక్క మునుగోడు మాత్రమే కాదు.. యావత్ నల్లగొండ జిల్లా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలం నుంచి అనేక ప్రజాఉద్యమాలకు ఊపిరులూదిన వామపక్ష భావజాలానికి కేంద్ర స్థానంగా నిలిచిన ప్రాంతం. దేశంలో గుణాత్మక మార్పు కోసం నిర్మాణాత్మకంగా జరుగుతున్న ప్రయత్నాలకు వామపక్ష చైతన్యం ప్రేరణగా నిలవాల్సిన సందర్భం ఇది. వామపక్ష మేధావులు, నాయకులు.. ప్రజలను సరైన మార్గంలో నడిపించాల్సిన తరుణమిది. ఫ్లోరోసిస్ రక్కసిని రూపుమాపాలంటే దాని మూలాలు తెలిసిన వాళ్లు కావాలి. ప్రజల కష్టమే తన కష్టంగా, ప్రజల మేలే తనమేలుగా భావించే పాలకుడు కేసీఆర్ కాబట్టే మూడున్నరేండ్లలోనే ఫ్లోరైడ్‌ను అంతం చేయగలిగారు. ఈ నేపథ్యంలోనే వామపక్షాలు టీఆర్ఎస్తో జతకట్టాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో విజయపతాకకు మునుగోడులో గులాబీ రెపరెపలు శ్రీకారం చుడుతాయని విశ్వసిస్తున్నాయి.
కేసీఆర్ మదిలో మునుగోడు
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ రూపంలో పెనుమార్పులు రాబోతున్నాయని దేశంలోని రాజకీయ పండితులు, అన్ని వర్గాల మేధావులు, బుద్ధిజీవులు ఆకాంక్షిస్తున్నారు. తెలంగాణ మాడల్ దేశానికి అనివార్యమని అన్ని వర్గాలూ చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో మునుగోడు ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. ఈ తరుణంలో మునుగోడు ప్రజల ముందు గురుతర బాధ్యత ఉన్నది. దేశరాజకీయాల్లో కేసీఆర్ చేయబోయే జైత్రయాత్రకు మునుగోడు ప్రజలు ఇచ్చే సంపూర్ణమైన.. భారీ మెజారిటీ ఆయనకు కొండంత బలాన్ని ఇస్తుంది. ‘నా బలం మీరే.. నా బలగం మీరే’ అని కేసీఆర్ ఇటీవల మునుగోడులో జరిగిన బహిరంగ సభలో మునుగోడు ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఆకాశానికెత్తిన ఏ సందర్భాన్ని సీఎం కేసీఆర్ మరచిపోలేదు. ప్రత్యేక సందర్భాల్లో అనేక ప్రతికూలతలను ఎదుర్కొని బరిగీసి నిలబడిన ప్రజలంటే కేసీఆర్‌కు ప్రాణసమానం. వాళ్లను గుండెల్లోపెట్టుకొని చూసుకుంటారు. ఇది చరిత్ర కాదు. కండ్ల ముందు కదలాడే సాక్ష్యం. తెలంగాణ ఉద్యమ సమయంలో మర్రిగూడ మండలంలో ఫ్లోరోసిస్ బాధితుల కష్టాలు శాశ్వతంగా పోవాలంటే కృష్ణాజలాలు రావాల్సిందేనని ప్రతినబూనారు. రాష్ట్రం ఏర్పడ్డ మూడేండ్ల కాలంలోనే మిషన్ భగీరథను తెచ్చి ఫ్లోరైడ్ భూతాన్ని నల్లగొండ నుంచి.. మునుగోడు నుంచి శాశ్వతంగా సాగనంపారు. శివన్నగూడెం, శెర్లగూడెం రిజర్వాయర్ల నిర్మాణ పనులను చేపట్టారు. కేసీఆర్ మాటే శాసనం. పట్టుబడితే వదలిపెట్టడు. సమస్య అంతు చూసేదాకా కొట్లాడ్తనే ఉంటడు. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికలో ఇప్పటికే టీఆర్ఎస్ గెలిచిపోయింది. కానీ ‘దిల్ మాంగే మోర్’ అన్నట్టు మునుగోడు వ్యవహరించాలె. టీఆర్ఎస్కు భారీ మెజారిటీని ఇవ్వాలనేది బుద్ధి జీవుల ఆకాంక్ష.
2006లో నల్లగొండ జిల్లా మర్రిగూడ ఫ్లోరోసిస్ బాధితులతో సమావేశం అనంతరం జలసాధన సమితి కార్యాలయంలోని రిజిస్టర్లో కరీంనగర్ ఎంపీ హోదాలో ఉద్యమ నాయకుడు, కేసీఆర్ చేసిన సంతకం (ఫైల్)
మర్రిగూడలో కేసీఆర్ చేసిన వాగ్దానం ఇదీ
‘సంస్థ మానవతా దృక్పథంతో ప్రాథమిక హక్కు అయిన, మానవ అవసరమైన తాగునీరు, సాగునీరు అందించి ఫ్లోరోసిస్ మహమ్మారిని పారదోలాలని అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న సుభాష్‌కు హ్యాట్సాఫ్. ప్రపంచంలో ఫ్లోరోసిస్‌కు నల్లగొండ ప్రసిద్ధి అంటే వికలాంగులుగా శారీరక, మానసిక పరంగానే కాకుండా ప్రవృత్తిలో కూడా ప్రస్ఫుటంగా కనిపించే ఈ అవిటితనాన్ని రూపుమాపాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారా, 200 టీఎంసీల కృష్ణా జలాలు నల్లగొండకు ఇచ్చి నల్లగొండ మాతృభూమిని పూర్తిగా కడిగివేయాలి’ అని ఉద్యమ నాయకుడు కేసీఆర్ 2006లో నల్లగొండ జిల్లా మర్రిగూడలోని ఫ్లోరోసిస్ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో జలసాధన సమితి కార్యాలయ రిజిస్టర్లో రాసి సంతకం చేసిన వాగ్దానం ఇది. ఆ రోజు కేసీఆర్ దాదాపు మూడుగంటలపాటు అక్కడే ఉండి మునుగోడు ఫ్లోరోసిస్ బాధితులతో మాట్లాడి, వారి కష్టసుఖాలు తెలుసుకొన్నారు.
మునుగోడుపై చారిత్రక బాధ్యత
మునుగోడు ఎన్నిక ఒక కొత్త చరిత్రకు నాందీవాచకం పలుకబోతున్నది. ఇప్పటికిప్పుడు ఎన్నిక జరిగితే.. టీఆర్ఎస్కు 40 నుంచి 50 వేల వరకు మెజార్టీ వస్తుందని సర్వేలు చెప్తున్నాయి. మునుగోడు ఓటర్లు ఈ సంతోషంతో సరిపెట్టుకోకుండా.. మరింత భారీ మెజార్టీని ఇవ్వడం ద్వారా.. భారత రాష్ట్ర సమితి ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించాలనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ తెలంగాణకు ఎలా టార్చ్‌బేరర్‌గా పనిచేసిందో.. రేపు కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ కూడా దేశానికి టార్చ్ బేరర్‌గా వ్యవహరించాలనే విశ్వాసాన్ని దేశ ప్రజల్లో కల్పించే సన్నివేశం ఇది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో దేనికీ రాని అవకాశం మునుగోడుకు ఇప్పుడు లభించింది. అస్తవ్యస్త విధానాలతో దేశాన్ని అన్ని రంగాల్లో భ్రష్టు పట్టిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. కోవర్టుగా పేరుపడిన ఒక నేతకు వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చి తెచ్చిపెట్టిన ఉప ఎన్నిక ఇది. ఏ జాతీయ రాజకీయాలకు రాకుండా కేసీఆర్‌ను అడ్డుకోవాలని.. రాష్ర్టానికే పరిమితం చేయాలని బీజేపీ ఈ ఉప ఎన్నిక తెచ్చిందో.. అవే జాతీయ రాజకీయాలకు ఇదే ఉప ఎన్నిక.. చరిత్రాత్మక ముందడుగు కావాలని పరిశీలకులు భావిస్తున్నారు.
మునుగోడు గెలుపు జాతీయ రాజకీయాల్లో మలుపు
దేశం కోసం.. తెలంగాణ కోసం కేసీఆర్ అడుగు మొదలుపెట్టిండు. ఆయన అడుగులో మేం భాగం అవుతాం. దుర్మార్గ బీజేపీ ఆగడాలను కలిసికట్టుగా ఎదుర్కొంటాం. వామపక్షాలు బలపరచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల గెలుపు ఖాయమైంది. చైతన్యవంతమైన మునుగోడులో బీజేపీకి స్థానం లేదు. మునుగోడు గెలుపు జాతికి మలుపు.
– కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
మోదీ పతనం మునుగోడు నుంచే మొదలు
మునుగోడు నుంచే మోదీ పతనం మొదలవుతుంది. బీజేపీకి ఓటేయటానికి ప్రజలెవరూ సిద్ధంగా లేరు. వామపక్ష చైతన్యమున్న మునుగోడులో బీజేపీ ఆటలు సాగవు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు బయలుదేరిన కేసీఆర్‌కు మునుగోడు ప్రజలు కచ్చితంగా అండగా నిలబడతారు.
– తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి