KCR | హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంలోని అంశాల కన్నా, అసెంబ్లీ లోప ల, బయట, ఎవరినోట విన్నా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పైనే చర్చ. ‘సార్ మీటింగ్‌కు వచ్చిండా?, కేసీఆర్ వచ్చారా? సీఎం కంటే ముందే కేసీఆర్ సభకు వచ్చినట్టున్నరు! ఇలా అసెంబ్లీ ప్రాంగణంలో ఏ ఇద్దరు కలిసినా, చివరికి ఒకరిద్దరు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసినా ఇదే ముచ్చట. ఈ బడ్జెట్ సమావేశాల ప్రారంభ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం నిర్దేశిత సమాయానికన్నా 40 నిమిషాల ముందే అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో హాజరయ్యేందుకు కేసీఆర్ వస్తున్నారనే విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ సభ్యులు ఎదురేగి స్వాగతం పలికారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనమండలిలో ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కాలేరు వెంకటేశ్, కోవా లక్ష్మి సహా పలువురు శాసనసభ, మండలి సభ్యులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అసెంబ్లీ ప్రవేశద్వారం నుంచి కేసీఆర్ లోపలికి చేరుకొని నేరుగా ప్రతిపక్ష నేత చాంబర్లో కూర్చున్నారు.
కేసీఆర్‌ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
కేసీఆర్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, జారే ఆదినారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీకి కేసీఆర్ వచ్చారని తెలుసుకున్న గూడెం మహిపాల్‌రెడ్డి వెళ్లి తన తమ్ముడి కుమారుడి వివాహ పత్రిక ను అందజేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాం గ్రెస్‌లో చేరిన మహిపాల్‌రెడ్డి కేసీఆర్‌ను కలవడం చర్చనీయాంశమైంది. సభ ప్రారంభ నిర్దేశ సమయానికి ముందే కేసీఆర్ సహా బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ సమావేశ మందిరానికి వెళ్లారు. అసెంబ్లీలో కేసీఆర్ వద్దకు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్వయంగా వచ్చి పలుకరించి వెళ్లారు. కేసీఆర్ సభకు వచ్చారనే విషయాన్ని తెలుసుకున్న ఒక మంత్రి ‘మా కన్నా ముందే కేసీఆర్ వచ్చిండా?’ అని ఆశ్చర్యానికి గురయ్యారు. కాంగ్రెస్, బీజేపీ సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఇలా అందరికందరూ గవర్నర్ ప్రసంగం కన్నా కేసీఆర్ గురించే ముచ్చటించుకోవడం విశేషం.