హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని కులాల ఆత్మగౌరవం పెంచేందుకు ప్రత్యేకంగా ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. గత పాలకులు ఆత్మగౌరవం డైలాగులు కొట్టారే తప్ప ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. తాము ప్రతి కులాన్నీ కడుపులో పెట్టుకొని చూసుకొంటున్నామని చెప్పారు. సర్వాయి పాపన్న, కొమురం భీం, చాకలి ఐలమ్మ తదితర పోరాట యోధుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతీరుపై శుక్రవారం శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బీసీ కులాలకు 40 ఆత్మగౌరవ భవనాలు మంజూరు చేశామని, వాటి నిర్మాణానికి వేల కోట్ల విలువైన భూములు, 80 కోట్ల నిధులు ఇచ్చామని తెలిపారు. గచ్చిబౌలి సమీపంలో రెండు నుంచి నాలుగు ఎకరాల వరకు భవనాల నిర్మాణానికి కేటాయించామన్నారు. భవనాల నిర్మాణం జరుగుతున్నదని తెలిపారు. ‘బ్రాహ్మణ పరిషత్ భవన నిర్మాణం ఏమైందని మాజీ ఐఏఎస్ అధికారి రమణాచారిని అడిగితే ‘వేగంగా నిర్మాణం జరుగుతున్నది. ప్రారంభానికి మిమ్మల్నే పిలుస్తం సార్’ అని చెప్పారని సీఎం తెలిపారు. రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి ఏర్పాటుచేసిన రెడ్డి హాస్టల్ నిర్వాహకులు కూడా అడిగితే వారికి 15 ఎకరాల స్థలం ఇచ్చామన్నారు. ఆయన ఏర్పాటు చేసిన బాలికల కాలేజీకి కూడా మెడకల్ డిపార్ట్మెంట్ నుంచి 1,500 గజాల స్థలం కేటాయించినట్టు తెలిపారు. రెడ్డి, కమ్మ, వెలమ కులస్తులు ఆత్మగౌరవ భవనాలు కట్టుకుంటామని వస్తే వాళ్లకు కూడా ఇచ్చామని చెప్పారు. ‘కమ్యూనిటీ హాల్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్’ అనే పద్ధతిలో యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని కలుపుకొని ప్రభుత్వం ముందుకు పోతున్నదని తెలిపారు. ఇదే పద్ధతిలో అందరికీ సమన్యాయం చేస్తామని సీఎం చెప్పారు.