సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): భవన నిర్మాణాలకు సులభంగా అనుమతినిచ్చే టీఎస్ బీపాస్ వ్యవస్థ ప్రారంభమై రెండేండ్లు పూర్తయ్యింది. తొలుత హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ వ్యవస్థ తరువాత రాష్ట్రంలోని ఇతర నగరాలు, మున్సిపాలిటీలకు విస్తరించారు. ఒకప్పుడు ఇంటి నిర్మాణానికి అనుమతులు పొందడానికి నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. టీఎస్ బీపాస్ రాకతో ఇండ్ల నిర్మాణానికి అనుమతుల ప్రక్రియ సులభతరం, వేగవంతం అయింది. దరఖాస్తు చేసుకున్న వెంటనే టౌన్‌ప్లానింగ్ విభాగం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వెంటనే అనుమతులు మంజూరు చేస్తున్నది. 75 గజాలలోపు ఇండ్లకు ఒక్క రూపాయికే అనుమతి పొందుతున్నారు.
ప్రధానంగా 75 నుంచి 600 చదరపు గజాల వరకు స్థలంలో 10 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే నివాస భవనాలకు స్వీయ ధ్రువీకరణతో అనుమతులు పొందుతున్నారు. అయితే అనుమతి పొందిన స్థలాలను పరిశీలించేందుకు జోనల్ స్థాయిలో ప్రత్యేకంగా నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీ పోస్ట్ వెరిఫికేషన్ జరుపుతున్నది. గరిష్ఠంగా 21 రోజుల వ్యవధిలోనే అనుమతుల ప్రక్రియ పూర్తి కావడంతో టీఎస్‌బీపాస్ దేశంలోనే ఆదర్శవంతమైనదిగా నిలుస్తున్నది.
టీఎస్‌బీపాస్ అమలులోకి వచ్చిన తరువాత బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,54,701 దరఖాస్తులు రాగా, 1,09,542 నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 34,359 దరఖాస్తులను స్వీకరించగా 24,398 నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చారు. ఎప్పటికప్పుడు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణ చేస్తుండడంతో టీఎస్ బీపాస్ విధానం సమర్థవంతంగా ఆమలవుతున్నది.