నల్లగొండ: ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు (Nagarjuna Sagar) వరద పోటెత్తుతున్నది. దీంతో జలాశయం అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 8 గేట్లను 10 అడుగుల మేర, 18 గేట్లను 5 అడుగుల మేర పైకి ఎత్తి 2,60,344 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు.. ప్రస్తుత నీటి మట్టం 588.40 అడుగులు. సాగర్ గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలకుగాను ప్రస్తుతం 307.2834 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టులోకి 2,52,840 క్యూసెక్కుల వరద వస్తుండగా, 2,92,826 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది.
ఇక శ్రీశైలం (Srisailam) జలాశయానికి పెద్దఎత్తున వరద వస్తుండటంతో ఏడు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి స్పిల్ వే ద్వారా 1,87,208 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 65,632 క్యూసెక్కులను వదులుతున్నారు. శ్రీశైలానికి జూరాల, సుంకేసుల నుంచి 1,174,221 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో ప్రాజెక్టులో 882.10 అడుగుల నీటిమట్టం, 199.2737 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.