హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): గత 36 ఏండ్లలో వర్షాకాలం ప్రారంభంలోనే ఊహించని విపత్తు. ఈ నెలలో ఇప్పటికే 450 శాతం అధిక వర్షపాతం! ఒక్కరోజే భూపాలపల్లి జిల్లా ముత్తారంలో 50 సెంటీమీటర్ల వాన. 22 ఏండ్ల తర్వాత భద్రాచలం వద్ద 71 అడుగులకు చేరి గోదావరి తాండవం.. రాష్ట్రంలో క్లౌడ్ బరస్ట్‌కు ఇవీ నిదర్శనాలు. ఈ నెల ఏడో తేదీ నుంచే ఏకధాటిగా వానలు మొదలవగానే ప్రమాదాన్ని పసిగట్టిన సీఎం కేసీఆర్ వెంటనే చర్యలకు ఉపక్రమించారు. 9వ తేదీ నుంచి ఆదివారం వరకు వర్షాలు, వరద నష్టాలపైనే దృష్టిపెట్టారు. ప్రగతిభవన్‌ను వార్రూంగా మార్చేశారు. గంటల తరబడి సమీక్షలు నిర్వహించారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఎక్కడ వాన ముప్పు ఉన్నదో స్వయంగా సమీక్షిస్తూ, అక్కడి నుంచే ఆ ప్రాంత ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేసి అప్రమత్తం చేశారు. స్థానికంగా ఉండి అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకొని సహాయక చర్యలు చేపట్టడంపై దృష్టిసారించారు. ప్రాజెక్టుల్లో చేరే వరదనీటిని ఎప్పటికప్పడు వదిలేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్డీ-ఆర్ఎఫ్, రెస్యూ బృందాలు, హెలికాప్టర్లను వరద ముప్పు ఉన్నచోట మోహరించారు.
సెక్రటేరియట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయించారు. గంట గంటకు పెరిగిపోతున్న వరద ఉధృతిని గమనిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ వీడియో, టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమర్, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు పోలీస్, ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ యుద్ధప్రాతిపదికన తీసుకోవాల్సిన సహాయక చర్యలపై ఆదేశాలు జారీచేశారు. భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చటంతో మంత్రి పువ్వాడ అజయ్‌ను అక్కడే ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించి సహాయక చర్యల్లో నిమగ్నం చేశారు. ముందస్తుగా అన్ని పరీక్షలు వేయాలని ఆదేశించి, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఫలితంగా అతి తక్కువ ప్రాణ, ఆస్తి నష్టంతో పెను విపత్తును సమర్థంగా సీఎం కేసీఆర్ ఎదుర్కొన్నారు. ఇంతటి ముందుచూపుతో ముఖ్యమంత్రి వ్యవహరిస్తుంటే వర్షాలు, వరదలపై ప్రభుత్వం స్పందించలేదంటూ ప్రతిపక్ష నాయకులు కండ్లున్న గుడ్డివాళ్లలా ప్రవర్తించటం చూసి ప్రజలు నవ్వుకొంటున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలకు సాయం చేయకుండా తెలంగాణపై వివక్ష ప్రదర్శిస్తున్న కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా, ఉల్టా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం ప్రతిపక్ష నాయకుల అవివేకానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్న యంత్రాంగం మనోైస్థెర్యం దెబ్బతీసేలా విమర్శలు చేయడాన్ని ప్రజలు సైతం అసహ్యించుకొంటున్నారు.