సంగారెడ్డి,నవంబర్ 23(నమస్తే తెలంగాణ): సింగూరు ప్రాజెక్టు భద్రతపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఎన్డీఎస్ఏ నివేదిక ఇవ్వగా, సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది. సింగూరు ప్రాజెక్టుకు ఇరువైపులా ఉన్న ఆనకట్టలకు పగుళ్లు ఏర్పడ్డాయి. తనిఖీల సందర్బంగా దీనిని గుర్తించిన ఎన్డీఏస్ఏ తక్షణమే ఆనకట్టలకు మరమ్మతు పను లు చేపట్టాలని సూచించింది. ఈ ప్రాజెక్టును క్యాటగిరీ-2లో చేర్చిన ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వానికి, నీటిపారుదల శాఖకు లేఖలు రాసింది. మరమ్మతు పనులు చేయాలంటే రిజర్వాయర్లోని నీటిని పూర్తిగా ఖాళీ చేయా ల్సి ఉంటుంది. ఇదే జరిగితే రెండేండ్లపాటు జంటనగరాలు, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు పూర్తిగా, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు పాక్షికంగా తాగునీటి సరఫరా నిలిచిపోనున్నది. ఈ ఆనకట్ట కింద ఉన్న 40 వేల ఎకరాలకు సాగునీరు కూడా అందదు. సింగూరు ప్రాజెక్టు ఖాళీ చేస్తే తాగునీటి సమస్యను ఎలా పరిష్కరించాలన్నది ప్రభుత్వం ముందున్న సవాల్.
సింగూరు ప్రాజెక్టు ఖాళీ చేయడం, మరమ్మతు పనులు చేపట్టడంపై అధ్యయనం చేసేందుకు ఆరుగురితో కూడిన హైలెవల్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. కమిటీ ఏర్పాటుపై రెండురోజుల్లో ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉన్నది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే ప్రభుత్వం సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేయడం, మరమ్మతు పనులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.
సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం ప్రాజెక్టులో 16 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. నీటిని పూర్తిగా ఖాళీచేస్తేనే ఇరువైపులా ఆనకట్టల మరమ్మతు పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. దీంతో నవంబర్ లేదా డిసెంబర్లో ప్రాజెక్టును పూర్తిగా ఖాళీచేసి మరమ్మతు పనులు చేపట్టాలని నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ప్రాజెక్టు కాల్వల లైనింగ్ పనులు చేపడుతున్న దృష్ట్యా ప్రస్తుతం క్రాప్ హాలిడే ప్రకటించారు. దీంతో ప్రాజెక్టు దిగువన 40 వేల ఎకరాలకు సాగునీరు సరఫరా కావడం లేదు. ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ జంటనగరాలకు తాగునీటి అవసరాల కోసం ఏటా 7 టీఎంసీల జలాలను కేటాయిస్తున్నారు.
సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు తాగునీటి సరఫరా కోసం మిషన్ భగీరథ పథకానికి ఏటా 5.7 టీఎంసీల జలాలను కేటాయించారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్, తూప్రాన్ ప్రాంతంలోని ప్రజల తాగునీటి అవసరాల కోసం మిషన్ భగీరథకు 0.7 టీఎంసీలను కేటాయిస్తున్నారు. మరమ్మతు పనుల కోసం ప్రాజెక్టు నీటిని ఖాళీ చేస్తే జంటనగరాలతోపాటు సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు తాగునీటి సరఫరా రెండేండ్లపాటు నిలిచిపోయి, నీటికొరత ఏర్పడుతుంది. హైదరాబాద్ జలమండలి ఇప్పటికిప్పుడు 7 టీఎంసీల జలాలను సమకూర్చుకోవాలంటే కృష్ణా జలాలు లేదా మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను జంటనగరాలకు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా కొత్త పైప్లైన్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది.