రాజోళి, ఆగస్టు 6: జోగుళాంబ గద్వాల జిల్లా తుమ్మిళ్ల లిఫ్ట్ వద్ద అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై అధికార కాంగ్రెస్ పార్టీ జులుం ప్రదర్శించింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ప్రొటోకాల్ పద్ధతినే అపహాస్యం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు తలొగ్గిన అధికారులు ఎమ్మెల్యేనే అరెస్ట్ చేయించారు. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఈ ఘటన మంగళవారం జరిగింది. పెద్ద ఎత్తున వరద రావడంతో ప్రొటోకాల్ ప్రకారం ఇరిగేషన్ అధికారు ల పిలుపుమేరకు ఎమ్మెల్యే విజయుడు ఎత్తిపోతల మోటర్లను ఉ.7:15 గంటలకు రన్ చేశారు.విషయం తెలుసుకొన్న మాజీ ఎమ్మెల్యే సంపత్ అనుచరులతో ప్రాజెక్టు వద్దకు చేరుకొని మోటర్లను బంద్ చేయించారు. అక్కడున్న సిబ్బందిపై అధికార పార్టీ నాయకులు చేయిచేసుకున్నట్టు స్థానికులు తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే సంపత్ వైఖరిపై ఎమ్మెల్యే విజయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. మోటర్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని కలెక్టర్‌ను, ఇరిగేషన్ అధికారులను కోరారు. ఎన్నిసార్లు విన్నవించినా ఆన్ చేయకపోవడంతో ఎమ్మెల్యే లిఫ్ట్ వాటర్ డెలివరీ పాయింట్ డీ-22 వద్దకు చేరుకొని రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసనకు దిగారు. మోటర్లు ఆన్ చేసేవరకు నిరసనలు ఆపేది లేదని టెంటు వేసి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రైతులు వంటావార్పు చేపట్టా రు. సాగునీరు అందించాలని తాను వస్తే రాజకీయం చేయడం సరికాదని ఎమ్మెల్యే విజయుడు మండిపడ్డారు.నడిగడ్డరైతులకు కేసీఆర్ ఇచ్చిన వరం తుమ్మిళ్ల ప్రాజెక్టు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అడిషనల్ ఎస్పీ గుణశేఖర్, ఇతర పోలీస్ అధికారులు అక్కడకు చేరుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మోటర్లను ఈ రోజు ప్రారంభిం చం, అందరూ వెళ్లిపోవాలని కోరారు. మోటర్లు ఆన్ చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఎమ్మెల్యే తేల్చిచెప్పారు. రైతులకు సాగునీరు అందించాలని, అదే తన లక్ష్యమని వేడుకుంటూ అడిషనల్ ఎస్పీ గుణశేఖర్ కాళ్లు పట్టుకొని ఎమ్మెల్యే విజయుడు విన్నవించారు. అయినా వినని పోలీసులు ఎమ్మెల్యేతోపాటు రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి శాంతినగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో రైతులు, కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే సంపత్ అక్కడికి చేరుకొని పంపులను ఆన్ చేయాలని అనుచరులు, రైతులతో కలిసి బైఠాయించారు. ఆర్డీఎస్ ఉన్నతాధికారులు, కలెక్టర్‌కు ఫోన్ చేశారు. అధికారులు మోటర్లను ఆన్ చేయడంతో పూజలు నిర్వహించారు. అనంతరం సంపత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని అయిజ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి పట్ల ప్రభుత్వ అధికారులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో ప్రతినిధులకు రోజూ అవమానాలేనా? అని నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే విజయుడు పట్ల గద్వాల జిల్లా అధికార యంత్రాంగం వ్యవహరించిన అనుచిత తీరుపై మండిపడ్డారు. ప్రజల చేతిలో తిరసరించబడిన కాంగ్రెస్ నేతలను అధికారిక సమావేశాలకు, కార్యక్రమాలకు ఎందుకు ఆహ్వానిస్తున్నారో చెప్పాలని, రాష్ట్రంలో ప్రజాప్రతినిధులను అవమానించేందుకు ప్రభుత్వం ప్రొటోకాల్ విధానాలను మార్చిందా.. అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రశ్నించారు.