జడ్చర్ల, నవంబర్ 21 : ‘బాంచెన్.. మీ కాల్మొక్తా.. ఎలాగైనా మా పత్తి కొనండి సారూ’ అంటూ ఓ పత్తి రైతు అధికారి కాళ్లపై పడి వేడుకున్నాడు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌కు చెందిన రైతు మల్లేశ్ స్లాట్ బుక్ చేసుకొని గురువారం 90 క్వింటాళ్ల పత్తిని డీసీఎం వాహనంలో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. 36 క్వింటాళ్ల పత్తిని దించిన అధికారులు మిగితాది కొనలేమంటూ చెప్పారు. సగం పత్తిని ఖరీదు చేశాక.. మిగితాది ఎందుకు కొనడం లేదని సీసీఐ అధికారిని ప్రశ్నించాడు. మిగిలిన పత్తి నాసిరకంగా ఉన్నదని, నాణ్యత లేని పంటను కొనలేమని తేల్చిచెప్పారు.
మరో స్లాటు బుక్ చేసుకొని పత్తిని తీసుకురావాలని సూచించారు. దీంతో విస్తుపోయిన రైతు మల్లేశ్.. ఎలాగైనా తీసుకోండి సారూ.. అంటూ కాళ్లపై పడ్డాడు. దూరం నుంచి వచ్చామని, మరో స్లాటు బుక్ చేసుకుంటే తనవంతు వచ్చేసరికి మూడు, నాలుగు రోజులు పడుతుందని ఆవేదన వ్యక్తంచేశాడు. మూడు రోజులుగా అధికారులు కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కేంద్రం వద్ద ఉన్న పలువురు రైతులు ఆందోళనకు దిగారు. తేమ అధికంగా ఉన్నదంటూ పత్తిని కొనకుండా సీసీఐ అధికారులు కొర్రీలు పెడ్తున్నారని ఆగ్రహం చెందారు. పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. సీసీఐ అధికారులతో మాట్లాడి కొనుగోలు జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.