నిజామాబాద్ : సినీ నటి అక్కినేని అమల గొప్ప మనసు చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఖంద్గాం ప్రాథమికోన్నత పాఠశాలకు అక్కినేని అమల రూ. 50 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నెమలి సంజీవ్ కుమార్ తెలిపారు.
గతంలో ఖంద్గాం గ్రామంలో జరిగిన ఓ వివాహానికి అమల వచ్చినప్పుడు పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలను టీచర్లు, గ్రామస్తులు ఆమెకు వివరించారు. దాతల సహకారంతో పాఠశాలలో రూ. 2 లక్షల 50 వేలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. దీంతో తాను కూడా రూ. 50 వేల ఆర్థికసాయం చేస్తానని అమల మాటిచ్చి, నెరవేర్చారు అని నెమలి సంజీవ్ కుమార్ పేర్కొన్నారు. అక్కినేని అమలకు గ్రామ సర్పంచ్, గ్రామస్తులు, ఉపాధ్యాయులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.