 
                                                            మరిపెడ, అక్టోబర్ 30: మొంథా ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో పరీవాహక ప్రాంతాలైన ఉల్లేపల్లి, బీచురాజుపల్లి, పురుషోత్తమయాగూడెం, బాల్నీధర్నారం, తండా ధర్నారం ప్రజలు బుధవారం రాత్రంతా భయం గుప్పెట్లో గడిపారు. నిరుడు ఆకస్మికంగా విరుచుకుపడిన వరదల నుంచి పూర్తిగా కోలుకోకముందే మొంథా తుఫాన్ ప్రభావంతో మరోసారి ఆకేరు వాగుకు వరద పోటెత్తడంతో భయంతో వణికిపోతున్నారు.
అధికారులు మాత్రం తూతూ మంత్రంగా వచ్చి పర్యవేక్షణ చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడంలేదని ఆందోళన వ్యక్తంచేస్తూ గురువారం మహబూబాబాద్, నకిరేకల్ జాతీయ రహదారి 365పై సీతారాంతండావాసులు 2గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరుడు ముఖ్యమంత్రి తండాలో పర్యటించి సీతారాంతండా, బాల్నీధర్నారం ప్రజలకు సురక్షిత ప్రాంతాల్లో నివాస గృహాలను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ముఖ్యమంత్రి హామీకే దిక్కు లేదని, తమకు నాయ్యం చేసేదెవరని రోడ్డుపై భీష్మించుకు కూర్చున్నారు. తహసీల్దార్ కృష్ణవేణి, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, సీఐ రాజ్‌కుమార్‌గౌడ్, ఎస్సై కోటేశ్వరావు తండావాసులతో మాట్లాడినా ససేమీరా అనడంతో అధికారులు కలెక్టర్‌కు సమాచారం అందజేశారు. సమస్య పరిష్కారం కోసం తండావాసులను కలెక్టరేట్‌కు రమ్మనడంతో శాంతించారు.
 
                            