కంచ గచ్చిబౌలి భూముల అంశం ముగియగానే.. కాంగ్రెస్ సర్కార్ కన్ను మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ భూముల మీద పడింది. ఉర్దూ వర్సిటీ నుంచి ఐఎస్బీ భూముల జోలికి కూడా రేవంత్ ప్రభుత్వం వెళ్తున్నట్టు తెలిసింది. ఇదేం పద్ధతి?
హైదరాబాద్, జనవరి 6(నమస్తే తెలంగాణ) : కంచె గచ్చిబౌలి(హెచ్‌సీయూ) భూముల అంశం ముగియగానే.. కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(మనూ) భూములపై పడిందని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఆరోపణలు చేశారు. ఉర్దూ వర్సిటీ నుంచి ఐఎస్బీ వర్సిటీ భూముల జోలికి కూడా రేవంత్ సర్కార్ వెళ్లినట్టు తన దృష్టికి వచ్చిందంటూ మంగళవారం అసెంబ్లీలో పేర్కొన్నారు. మూడు నాలుగు రోజులుగా శాసనసభలో వేర్వేరు అంశాలపై తాను మాట్లాడిన కొన్ని వీడియోల నుంచి కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా కొన్ని పాయింట్లను డిలీట్ చేసి బయటకు రిలీజ్ చేస్తున్నదంటూ ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో ఏక్యూఐ గురించి తాను మాట్లాడిన వ్యాఖ్యలు సభకు సంబంధించిన వీడియోలో లేవని తర్వాత రోజు మాత్రం అన్ని వార్తాపత్రికల్లో వార్తలు వచ్చినట్టు ఆయన తెలిపారు.
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణలో కారుచీకట్లు కమ్ముకుంటాయని.. నీళ్లు, నిధులకు ఇబ్బందులు తప్పవని మాట్లాడినవారికి తెలంగాణ అభివృద్ధే చెంపపెట్టు అని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి పేరు ప్రస్తావించకుండానే అక్బరుద్దీన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీలో ‘తెలంగాణ రైజింగ్-2047’ అంశంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాడు ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి కాంగ్రెస్‌కు చెందిన వారే అంటూ అధికార పార్టీకి చురకలంటించారు. ఇవాళ ఆ పెద్దమనిషి కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్లారని తెలిపారు. ఎంత దోచుకుంటారో దోచుకొని ఈడీ, ఐటీ, సీబీఐ నుంచి బయటపడాలంటే బీజేపీలోకి వెళ్లాల్సిందేనని విమర్శించారు. బీజేపీకి ‘వాషింగ్ మిషన్’ ఉన్నందున సదరు వ్యక్తి పార్టీ మారారంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.