Akbaruddin Owaisi | హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు కొనుగోలు వ్యాపారం అడ్డగోలుగా సాగుతున్నదని ఎంఐ ఎం పార్టీ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శించారు. అధిక రేట్లకు అవసరానికి మించి వి ద్యుత్తు కొనుగోలు చేసినప్పటికీ ఎందుకు అప్రకటిత విద్యుత్తు కోతలు పెరుగుతున్నాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో 30 శాతం మిగులు విద్యుత్తు ఉన్నప్పటికీ ఎందుకు కోతలు విధిస్తున్నారని నిలదీశారు. అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్‌లో కరెంట్ కోతలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యకంచేశారు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాం తాల్లో గంటల తరబడి విద్యుత్తు కోతలు ఉంటున్నాయని, ఆయా కంపెనీలు కరెంట్ లేదని.. ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరానికి మించి విద్యుత్తు కొనుగోలు చేస్తున్నది నిజమా? కాదా? అని ప్రశ్నించారు. ‘పవర్ పర్చేజ్ షాపింగ్ చల్రాయ్..’ అని ఎద్దేవా చేశారు. 2025-26లో 95 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరమని విద్యుత్తు రంగ నిపుణులు అంచనా వేయగా, 1.23 లక్షల మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఎందుకు కొనుగోలు చేశారని ప్రశ్నించారు. అంటే 30 శాతం అధికంగా విద్యుత్తు కొనుగోలు చేసినా కోతలు ఎందుకు ఉంటున్నాయని నిలదీశారు. కరెంటు కొనుగోళ్లలో బాగా లాభాలు ఉన్నట్టున్నాయని, అందుకే వేర్వేరు రేట్లకు విద్యుత్తు కొంటున్నారని విమర్శించారు.
ఆలోచించే మ్యానిఫెస్టో పెట్టారా?
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో తయారుచేసిన వారు ఆలోచించారా? లేదా? అని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ముందు అధికారంలోకి రానివ్వు.. అమలు సంగతి తర్వాత ఆలోచిద్దామనుకున్నారా? అని నిలదీశారు. పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన 420 హామీలను ఎలా అమలు చేయాలా? అని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నదని ధ్వజమెత్తారు. అసెంబ్లీ బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పోలీస్స్టేషన్లు భూముల సెటిల్మెంట్లకు అడ్డాగా మారాయని ఆరోపించారు. పోలీసులు శాంతిభద్రతలను పట్టించుకోకపోవడంతో క్రైమ్ రేటు గణనీయంగా పెరిగిందని విమర్శించారు. మహిళలపై లైంగికదాడులు, కిడ్నాప్‌లు, దోపిడీలు, దొంగతనాలను అడ్డుకోకపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారని తెలిపారు. మైనర్లు (చిన్న పిల్లలు) ద్విచక్రవాహనాలు నడుపుతున్నారని, పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని, వారికి కౌన్సెలింగ్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అనేక ప్రమాదాలకు మైనర్లే కారకులని పేర్కొన్నారు. పోలీసులు ఫొటోలు తీయడానికే ఉన్నారా? అని మండిపడ్డారు.
ఫైరింజన్ ఫిల్లింగ్ పాయింట్ ఎక్కడ?
రాష్ట్రవ్యాప్తంగా ఏటా పెద్దసంఖ్యలో అగ్నిప్రమాదాలు జరిగి వందల మంది మరణిస్తున్నా, కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అక్బరుద్దీన్ ఆందోళన వ్యక్తంచేశారు. అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఆరు అంతస్తులకు అనుమతి తీసుకొని 14 ఫ్లోర్లు కడుతున్నా అగ్నిమాపక అధికారులు పరిశీలించరా? అని ప్రశ్నించారు. నిబంధనలు పాటించినవారికి ఎన్వోసీ ఇవ్వకుండా, అతిక్రమించేవారి వద్ద డబ్బు తీసుకొని ఎన్వోసీ ఇస్తారని తీవ్ర ఆరోపణలు చేశారు. అగ్నిప్రమాదం జరిగితే రీఫిల్లింగ్ పాయింట్లు ఉన్నాయా? అని ప్రశ్నించారు. హైటెక్ సిటీలో ఫైరింజన్ ఫిల్లింగ్ పా యింట్లు ఎన్ని ఉన్నాయి? నీళ్లు అయిపోతే రీఫిల్లింగ్ కోసం ఎక్కడికి వెళ్లాలి? అని నిలదీశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం పనితీరు ఘోరంగా ఉన్నదని ఆరోపించారు.
పడిపోయిన రియల్ ఎస్టేట్
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందని, రియల్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారని అక్బరుద్దీన్ ఆందోళన వ్యక్తంచేశారు. ఎవ్వరి దగ్గర పైసలు లేవని, ప్రజలు భూములు కొనడం లేదని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రియల్ ఎస్టేట్ రంగాన్ని గాడినపెట్టాలని సూచించారు. భూభారతి అని పేరు మార్చారు తప్ప సమస్యలు అలాగే ఉన్నాయని విమర్శించారు. హైదరాబాద్‌లో 12 లక్షల ఇండ్లు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో అన్ని ఇండ్లు ఎలా సాధ్యమని తాను ప్రశ్నిస్తే, తనపై కాంగ్రెస్ నేతలు అంతెత్తున ఎగిరారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన ఈ 15 నెలల కాలంలో ఎన్ని ఇండ్లు నిర్మించారని నిలదీశారు.