నదీజలాలపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాం. కృష్ణా జలాల్లో రాష్ర్టానికి న్యాయమైన వాటా రావాలని కోరుకుంటున్నాం. కృష్ణా జలాల పంపిణీలో రాష్ర్టానికి జరిగిన అన్యాయం పట్ల మేము ఇదివరకే పలుమార్లు అభ్యంతరం తెలిపినం. కృష్ణా, గోదావరి నదులపై అనుమతులు లేకుండా నిర్మించిన ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలిపాలి. కర్నాటక నిర్మిస్తున్న ప్రాజెక్టులతోపాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను నిలిపివేయాలి.
– అక్బరుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం పక్షనేత
న్యాయమైన వాటాకోసం పోరాడాలి
కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధించుకునేందుకు పార్టీలకు అతీతంగా పోరాడాలి. కర్నాటక, తమిళనాడు రాష్ర్టాల్లో రాజకీయపార్టీల మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా రాష్ర్టానికి అన్యాయం జరిగితే అంతా ఏకమవుతారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా నదీజలాల కోసం కలిసి పోరాడాలి. కేంద్రంతో సఖ్యతతో ఉంటూ సామరస్య ధోరణితో ముందుకు సాగాలి. పోతిరెడ్డిపాడు నిర్మాణంతోనే అన్యాయానికి బీజం పడింది. నాడు సీఎంగా ఉన్న రాజశేఖర్రెడ్డి 44 వేల క్యూసెక్కుల నీటిని తరలించుకున్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా మొదలు 44 వేల క్యూసెక్కుల నుంచి ఇప్పటి సీఎం జగన్ 94 వేల క్యూసెక్కులు తరలించుకుపోతున్నారు. కృష్ణాజలాల్లో అన్యాయం జరగడం వల్ల మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సీపీఐ పూర్తిగా సమర్థిస్తున్నది.
– కూనంనేని సాంబశివరావు, సీపీఐ ఎమ్మెల్యే
అఖిలపక్షంగా ప్రధానిని కలుద్దాం
కృష్ణా జలాల్లో రాష్ర్టానికి న్యాయమైన వాటా సాధించేందుకు అన్ని పక్షాలు కలిసి ప్రధానిని కలిసి విజ్ఞప్తిచేద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే నీటి వాటాకోసం ఉద్యమించినం. గత ఎనిమిదేండ్లుగా 299 టీఎంసీల నీటికి ఎందుకు ఒప్పుకొన్నారు? 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంతో తెలంగాణకు నష్టం జరిగింది. 1956యాక్ట్ ప్రకారం అయితే నదీ జలాల్లో న్యాయం జరిగి ఉండేది. 2016లో అప్పటి ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడు ఒప్పుకొన్న విధంగానే నదీజలాల పంపిణీ జరిగింది. ఇప్పుడు ఆంధ్రా తరలించుకుంటున్న నీటిని ఏవిధంగా ఆపుతారో ముఖ్యమంత్రి తెలిపాలి.
– మహేశ్వర్రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే