హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): వేల కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చివేస్తరా? నిలిపివేస్తరా? కొనసాగిస్తరా? అనేది ప్రభుత్వం స్పష్టంచేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. రూ.లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజ్టెక్టుకు మరమ్మతు చేయాలని సూచించారు. జస్టిస్ ఘోష్ రిపోర్టులో కాంట్రాక్టర్ల పేర్లు ఎందుకు లేవని, వారికి డ్యామ్ డ్యామేజీలో బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.
సీఎస్ వంటి ప్రధాన అధికారులను ఎందుకు వదిలేశారని, నేరస్థుడు అప్రూవర్‌గా మారితే మంచివాడా? అని ప్రశ్నించారు. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. ఘోష్ కమిషన్ రిపోర్టు సభలో పెట్టకముందే, క్యాబినెట్లో పెట్టకముందే మీడియాకు ఎలా లీక్ అయ్యిందని ప్రశ్నించారు. రూ.6.78 కోట్లు రికవరీ చేయాలని కమిషన్ రిపోర్టులో ఉన్నదని పేర్కొంటూ.. మరి ఏర్పాటుకు ఎంత ఖర్చు చేశారని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతమాత్రం వైట్ ఎలిఫెండ్ కాదని అక్బరుద్దీన్ చెప్పారు. ‘కాళేశ్వరం ద్వారా 18 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు స్థిరీకరణ జరిగినట్టు బుక్‌లో ఉన్నది.మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాళేశ్వరం పనికిరాదని, ప్రాజెక్టు నుంచి ఒక ఎకరానికి నీళ్లు రావని అంటున్నారు.. కానీ, మంత్రి శ్రీధర్‌బాబు ఇచ్చిన రిపె్లైలో మూసీ నదికి కాళేశ్వరం నుంచి నీళ్లు తెస్తామని అంటున్నారు.
ఈ మంత్రులు ఏం మాట్లాడుతున్నారో వీళ్లకే అర్థం కావడం లేదు’ అని మండిపడ్డారు. కెనాల్స్, టన్నెల్స్, ఇతర అనేక అంశాలు పటిష్ఠంగా ఉన్నాయని స్పష్టంచేశారు. 2007లో ప్రాణహిత చేవెళ్ల చేపట్టారని, 2014 వరకు కాంగ్రెస్ పార్టీ పూర్తిచేసి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే అవకాశం ఉండేది కాదని చెప్పారు. 20 నెలల నుంచి ఏం చేస్తున్నారు? రిపేర్ చేయవచ్చుగా? అని నిలదీశారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు ఉన్నాయని, కాళేశ్వరం ఎంతమాత్రం వైట్ ఎలిఫెంట్ కాదని స్పష్టంచేశారు.
ప్రభుత్వంలోని కీలక అధికారుల పేర్లను నివేదికలో ఎందుకు పొందుపర్చలేదని అక్బరుద్దీన్ నిలదీశారు. ‘సీఎస్‌ను ఎందుకు బాధ్యుడిని చేయలేదు. వారిని అప్రూవర్‌గా మార్చుకున్నరు. వాళ్లని రక్షిస్తున్నారు. వారిని కూడా బయటపెట్టాలి. నవయుగ, ఎల్అండ్టీ, ఆఫ్రాన్స్ కంపెనీలు ప్రాజెక్టులో పాల్గొంటే.. ఒక్క ఎల్అండ్టీ పేరు మాత్రమే నివేదికలో ఎందుకు వచ్చింది? మిగతా కాంట్రాక్టర్ల పేర్లు ఎందుకు తీసుకురాలేదు? కాంట్రాక్టర్ల మీద కమిషన్ ఎందుకు మాట్లాడలేదు? కాంట్రాక్టర్లకు బాధ్యత లేదా? వాళ్లను కూడా బాధ్యులను చేయాలి?’ అని డిమాండ్ చేశారు.
ప్రతిపక్ష హోదాలో ఉన్న తమను అన్ని విషయాల్లో ప్రభుత్వం అడుగుతున్నదా? ఈ కమిషన్ విషయంలోనే ఎందుకు అడుతున్నారు? అని అక్బరుద్దీన్ నిలదీశారు. పెద్ద కాంట్రాక్టర్లను ఎందుకు దాచిపెడుతున్నారో చెప్పాలని కోరారు. ‘సీఐజీ, ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ రిపోర్టులను పరిగణనలోకి తీసుకోలేదని కమిషన్ నివేదికలో స్పష్టంగా చెప్పింది. వాటిని ప్రభుత్వం ఎందుకు కమిషన్‌కు ఇవ్వలేదు? కమిషన్ చివరికి ఏం చెప్పింది? అంతిమ ఫలితం ఏమిటి?’ అని అక్బరుద్దీన్ నిలదీశారు.
20 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం మేడిగడ్డను రిపేర్ ఎందుకు చేయలేదని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. ‘ఇప్పుడు అకడ 10 లక్షల క్యూసెకుల నీళ్లు ఉన్నా ఎందుకు కొట్టుకుపోలేదు. కాళేశ్వరానికి అయిన ఖర్చు రూ.94 వేల కోట్లు అయితే, మేడిగడ్డకు అయిన ఖర్చు రూ.4 వేల కోట్లు. మేడిగడ్డలో పగుళ్లు వచ్చిన బ్లాక్‌కు మరమ్మతులు చేయడానికి రూ.300 కోట్లు అవుతాయని, అది కూడా ఎల్అండ్టీ సంస్థ తామే పెట్టుకుంటామని చెప్తున్నదని తెలిపారు. కానీ, ప్రభుత్వం కావాలని ఆ సంస్థను మరమ్మతులు చేయడానికి అనుమతి ఇవ్వకుండా, ప్రజలకు నీటి కొరత వచ్చేట్టు చేసి కష్టాలు పెడుతున్నదని దుయ్యబట్టారు.
చర్చ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంధించిన ప్రశ్నలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆగమాగమయ్యారు. ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తడబడ్డారు. ఒక దశలో తన స్థానంలో కుదరుగా నిలబడని పరిస్థితి నెలకొన్నది. ఆ సమయంలో సీఎం రేవంత్‌రెడ్డిని చూసిన వారంతా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. సీఎం అంతలా అయోమయానికి, ఆందోళనకు గురికావడంపై జోరుగా చర్చ జరుగుతున్నది. కాళేశ్వరంపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, కాగ్ రిపోర్టులను ఘోష్ కమిషన్‌కు ఇవ్వలేదంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం తీవ్ర ఆందోళనకు గురైనట్టు కనిపించింది.
కమిషన్ నివేదికలో పేజీ నంబర్లతో సహా ప్రస్తావిస్తూ.. సదరు కమిషన్ విజిలెన్స్, ఎన్డీఎస్ఏ రిపోర్టులను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పిన అంశాన్ని అక్బరుద్దీన్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో సీఎం రేవంత్‌రెడ్డి తడబడ్డారు. పలుమార్లు పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఒక్క ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పలేకపోయారు. సమాధానాల కోసం నివేదికలో వెదకడం, తన టేబుల్‌పై వెదకడం కనిపించింది. ఆ రిపోర్టు ఏదయ్యా అంటూ అధికారులపైనా అసహనం వ్యక్తంచేశారు. ఆ పుస్తకం, ఈ పుస్తకం అటూ ఇటూ తిప్పుతూ అయోమయానికి గురయ్యారు. మరోవైపు అక్బరుద్దీన్ తన సందేహాలు, ప్రశ్నలు కురిపిస్తూనే ఉన్నారు.
అక్బరుద్దీన్ ఇదే విధంగా చెలరేగితే ప్రభుత్వ బండారం ఎక్కడ బయటపడుతుందేమోనని ఆందోళనకు గురైనట్టు కనిపించింది. దీంతో అక్బరుద్దీన్‌ను బుజ్జగించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. దోస్త్.. దోస్త్.. అంటూ అక్బరుద్దీన్‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినట్టు కనిపించింది. ఒక దశలో అక్బరుద్దీన్‌కు గల శక్తి తనకు లేదని వ్యాఖ్యానించారు. కమిషన్ నివేదికపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరితే.. అక్బరుద్దీన్ తననే తిడుతున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. అక్బరుద్దీన్ ప్రస్తావించే అంశాలు ప్రజల్లోకి వెళ్తే నష్టం తప్పదనే గ్రహింపుతో సీఎం రేవంత్‌రెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.