హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌పై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, అధికార పక్షం తమను కనీసం సంప్రదించలేదని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆక్షేపించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే అప్పటి నుంచి సాయంత్రం 5.30 గంటలవరకు సభలోనే తాము కూర్చొని ఉన్నామని తెలిపారు. సభలో ఏదైనా గందరగోళం జరిగితే స్పీకర్ సమక్షంలో వివిధ పార్టీలతో చర్చించడం, ఒకవేళ పరుష పదజాలం వాడితే ఆసభ్యుడితో అవసరమైతే క్షమాపణలు చెప్పించడం వంటి చర్యలు ఉంటాయని చెప్పారు.
కానీ జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ విషయంలో అలాంటివేమీ జరగలేదని తెలిపారు. ఎన్నికల ముందు కండీషన్లు లేకుండా హామీలు గుప్పించి, ఇప్పుడు మాత్రం అనేక ఆంక్షలు పెడుతున్నారని విమర్శించారు. కొత్త రేషన్‌కార్డుల కోసం 3 సార్లు ప్రజలు దరఖాస్తు చేసుకున్నారని, ఇంకా ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని ప్రశ్నించారు. కొత్త రేషన్‌కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టమైన తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత సంక్రాంతి నుంచే ఇస్తామని చెప్పిన సన్నబియ్యం ఇంకెప్పటి నుంచి ఇస్తారని నిలదీశారు.