హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్కుమా సింగ్ (ఏకే సింగ్) నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. సుప్రీంకోర్టు కొలీజియం జస్టిస్ ఏకే సింగ్‌ను తెలంగాణ హైకోర్టు సీజేగా బదిలీ చేయాలని గతంలో చేసిన సిఫారసును కేంద్రం ఆమోదించి రాష్ట్రపతి పంపింది. దీంతో రాష్ట్రపతి సోమవారం ఆమోదముద్ర వేశారు. జస్టిస్ ఏకే సింగ్ ప్రస్తుతం త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు. జస్టిస్ ఏకే సింగ్ 1965, జూలై 7న జన్మించారు. 1990లో పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. తర్వాత 2001లో జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగారు. 2012లో జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022 డిసెంబర్ నుంచి 2023 ఫిబ్రవరి వరకు జార్ఖండ్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా పని చేశారు. 2023 ఏప్రిల్ 17న పదోన్నతి లభించడంతో త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ అయ్యారు.
ప్రస్తుతం తెలంగాణ హైకోర్టుకు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ సుజయ్‌పాల్ కోల్‌కతా హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇటీవల కొలీజియం చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. తెలంగాణ హైకోర్టులో న్యాయవాదుల కోటా నుంచి నలుగురిని న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. గౌస్ మీరా మొహియుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్‌కుమార్ నియామకాలకు కూడా కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉన్నది. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తడకమళ్ల వినోద్‌కుమార్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. హైకోర్టులో తాజా బదిలీలు, నియామకాల అనంతరం సీజేతో కలిపి న్యాయమూర్తుల సంఖ్య 25కు చేరనున్నది. మరో 17 పోస్టులు ఖాళీగా ఉంటాయి. తెలంగాణ హైకోర్టు నుంచి గతంలో బదిలీపై వెళ్లిన ముగ్గురు న్యాయమూర్తులను తిరిగి ఇక్కడికే బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం గతంలో కేంద్రానికి సిఫారసు చేసింది.
రాజస్థాన్, త్రిపుర, జార్ఖండ్, మద్రాస్ హైకోర్టుల చీఫ్ జస్టిస్లను బదిలీ చేస్తూ వేరే ఉత్తర్వులు జారీ చేసింది. సంజయ్ సచ్దేవ్ను మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించారు. ఇప్పటివరకు ఆయన అదే న్యాయస్థానంలో తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విభు బక్రూను కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా, పాట్నా హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ అశుతోష్ కుమార్‌ను గౌహతీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా, పాట్నా హైకోర్టు జడ్జి విపుల్ మనుభాయ్ పంచోలిని అదే కోర్టు చీఫ్ జస్టిస్‌గా, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ తార్లోక్ సింగ్ చౌహాన్‌ను జార్ఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించారు. వీరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం మే 26న సిఫారసు చేసింది. అలాగే చీఫ్ జస్టిస్‌లలో మహీంద్ర మోహన్ శ్రీవాత్సవ రాజస్థాన్ నుంచి మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్ త్రిపుర నుంచి తెలంగాణ హైకోర్టుకు, జస్టిస్ ఎంఆర్ రామచంద్రరావు జార్ఖండ్ నుంచి త్రిపుర హైకోర్టుకు, జస్టిస్ కేఆర్ శ్రీరామ్‌ను మద్రాస్ నుంచి రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ చేశారు.