హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా టాలెంట్, మెరిట్, సాలర్షిప్ టెస్టులు పేరిట అనధికార ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్న పలు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. బుధవారం ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ ఆడిషనల్ డైరెక్టర్ కే లింగయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ..
పలు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యా హకు చట్టాన్ని ఉల్లంఘిస్తూ టాలెంట్, మెరిట్, సాలర్షిప్ టెస్టుల పేరిట అనధికార పరీక్షలను నిర్వహిస్తున్నాయని మండిపడ్డారు. పాఠశాల విద్యాశాఖ చెప్పినా కార్పొరేట్ విద్యాసంస్థలు యథేచ్ఛగా తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఇలాంటి విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.