మన్సూరాబాద్, జూలై 4: ఎన్నో ఏండ్లుగా నిరుద్యోగ యువత పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5 వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం దుర్మార్గమని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 20 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని, ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ పోలీసు అభ్యర్థులు దిల్‌సుఖ్‌నగర్‌లో ధర్నా నిర్వహించగా, వారిని పోలీసులు అరెస్ట్ చేసి నాగోల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
విషయం తెలుసుకున్న ధర్మేంద్ర వారిని పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేలాదిమంది యువత సంవత్సరాలుగా పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారని, ఈక్రమంలో ప్రభుత్వం కేవలం 5 వేల పోస్టులతో నోటిఫికేషన్ వేయడం నిరుద్యోగ యువతను మోసం చేయడమేననని పేర్కొన్నారు.
ఇటీవల డీజీపీ పేర్కొన్న ఖాళీలకు అనుగుణంగా వెంటనే 20 వేల పోలీస్ ఉద్యోగాలకు రీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరుద్యోగ యువతతో కలిసి ఆందోళనలు, నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, ప్రొఫెసర్ ప్రసన్న కృష్ణ, కిరణ్, కానిస్టేబుల్ అభ్యుర్థులు నవీన్, ఇంద్ర, ఆకాశ్, శంకర్, కుమార్, శంభు, వంశీ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.