హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో భాగంగా చేపట్టనున్న ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ కారిడార్ నిర్మాణ ప్రక్రియ మొదలైంది. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మించనున్న ఈ కారిడార్ కోసం ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) సంస్థ శుక్రవారం టెండర్లను ఆహ్వానించింది. ప్రాజెక్టుకు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణతోపాటు జనరల్ కన్సల్టెంట్‌ను ఎంపిక చేయనున్నారు. ఈ నెల 6న టెండర్ దరఖాస్తుదారులతో సమావేశాన్ని నిర్వహించనున్నామని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. బిడ్లను దాఖలు చేసేందుకు ఈ నెల 13ను చివరి తేదీగా నిర్ణయించారు. మరిన్ని వివరాలకు https://hmrl.co.in వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు. ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రయోజన వాహకం (ఎస్పీవీ)గా ప్రకటించింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(హెచ్ఎంఆర్ఎల్), తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల (టీఎస్ఐఐసీ) సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టుకు నిధులు
సమకూర్చనున్నాయి.
లోగో ఆవిష్కరణ
ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్‌కు సంబంధించిన లోగోను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. మూడు రంగుల్లో హెచ్ఏఎంఎల్ ఆంగ్ల అక్షరాలతోపాటు మెట్రో రైలు, దానిపైన విమానం చిత్రంతో ఈ లోగోను రూపొందించారు. ఇప్పటికే మొదటిదశలో నిర్మించిన హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించిన లోగోకు దీనికి ప్రత్యేకమైన తేడా ఉండేలా తీర్చిదిద్దారు. అంతర్జాతీయ నగరాలకు దీటుగా హైదరాబాద్ మహానగరాన్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఐటీ కారిడార్‌లోని రాయిదుర్గం మెట్రో స్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 31 కి.మీ మేర ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రో కారిడార్‌ను నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.6250 కోట్లను ప్రభుత్వం వెచ్చించనుంది. ఈనెల 9న సీఎం కేసీఆర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.